చంద్రయాన్-2 మిషన్ సూత్రధారులు ఈ ఇద్దరు మహిళలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరోసారి చంద్రుడి మీదకు ఉపగ్రహాన్ని పంపించబోతోంది. ఈ శాటిలైట్‌ను జులై 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. ఇస్రో ఇంతకు ముందు 2008 అక్టోబర్‌లో చంద్రయాన్-1 ఉపగ్రహం చంద్రుడిపైకి పంపించింది. ఇప్పుడు చంద్రయాన్-2 మిషన్‌కు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇది మహిళల నేతృత్వంలో జరుగుతున్న మొట్టమొదటి గ్రహాంతర మిషన్‌గా నిలిచింది. రీతూ కరిధల్ దీనికి మిషన్ డైరెక్టర్‌గా, ఎం.వనిత ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. చంద్రయాన్-2 గురించి ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ "మాకు మహిళలు, పురుషులు అనే తేడా లేదు. ఇస్రోలో సుమారు 30 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారు" అన్నారు. ఇస్రోలో ఒక పెద్ద మిషన్‌లో మహిళలు కీలకం కావడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు మార్స్ మిషన్‌లో కూడా 8 మంది మహిళలు కీలక పాత్ర పోషించారు. ఈసారీ చంద్రయాన్-2 మిషన్‌కు నేతృత్వం వహిస్తున్న రీతూ కరిధల్, ఎం.వనిత ఎవరు? వారి నేపథ్యం ఏమిటి?