పాక్ కాల్పులు .... జవానుకు గాయాలు శ్రీనగర్ : పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడిచింది. సోమవారం ఉదయం ఫూంచ్ జిల్లాలోని కృష్ణఘటి సెక్టార్లో పాకిస్థాన్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. పాక్ జరిపిన కాల్పులకు బీఎస్ఎఫ్ జవాను తీవ్రంగా గాయపడ్డారు. జవాన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్తో పాటు ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను 19 రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు తెలుస్తోంది.