రేపు వైద్యసేవల బంద్ 24 గంటల పాటు వైద్యసేవల బంద్ ప్రకటించిన భారత వైద్యుల సంఘం ఏపీ విభాగం అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకూ ఓపీ సహా అన్ని రకాల సాధారణ వైద్యసేవల్ని నిలిపివేస్తున్నట్లు భారత వైద్యుల సంఘం(ఐఎమ్‌ఏ) రాష్ట్ర విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.శ్రీహరిరావు, పి.ఫణిదర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులకు, ముఖ్యంగా కోల్‌కతాలో జరిగిన దాడిని తీవ్రంగా నిరసిస్తున్నామని ఓక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లను పరిష్కరించనందునే ఈ నిరసన పాటిస్తున్నట్లు వివరించారు. అత్యవసర కేసుల్ని మాత్రమే చూస్తామని, ప్రజలు దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.