వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వైకాపా ప్రభుత్వం

అమరావతి

వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వైకాపా ప్రభుత్వం.... ఇవాళ జరగబోయే నాలుగో మంత్రివర్గ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చించనుంది.

ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వంటి విధానపరమైన అంశంతో పాటు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, రివర్స్‌ టెండరింగ్‌, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, నూతన ఇసుక విధానం లాంటి..... కీలకమైన అంశాలపై నేటి మంత్రి వర్గ భేటీలో సమాలోచనలు చేయనుంది.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదం!

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

విశ్రాంత IPS అధికారి ఆంజనేయరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై ఇప్పటికే సంబంధిత అధికారులతో సీఎం జగన్‌ చర్చించారు.

రహదారి రవాణా సంస్థలోని 51 వేల మందిని యథాతథంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నారు.

ఇందుకయ్యే 3 వేల 500 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వమే మోయనుంది.

అయితే సంస్థను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అదే సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు విలీనానికి అడ్డంకిగా మారాయి.

అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మధ్య ఆర్టీసీ ఆస్తుల పంపకాల విషయం పెండింగ్‌లో ఉండటం కాగా... సంస్థలో 39 శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉండటం రెండోది.

ఈ రెండు విషయాల్లో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా... సంస్థ పరంగా విలీనం ఆలస్యమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

అలాగే ఆర్టీసీ ఆధునీకరణకు సంబంధించి కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నారు.

రివర్స్ టెండరింగ్,నూతన ఇసుక విధానంపై చర్చ

రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులతో పాటు పోలవరం రివర్స్ టెండరింగ్ అంశాల పైనా కేబినెట్ చర్చించనుంది.

సెప్టెంబరు 5నుంచి నూతన ఇసుక విధానాన్ని ప్రకటించాలని నిర్ణయించిన ప్రభుత్వం.... సమావేశంలో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టెండర్లను పిలిచిన ప్రభుత్వం.. సాంకేతిక ఇబ్బందుల కారణంగా అన్ని టెండర్లనూ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణా తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వమే ఇసుక రీచ్‌లను నిర్వహించేలా రూపకల్పన చేసిన నూతన ఇసుక విధానానికి మంత్రి మండలి సమ్మతి తెలపనుంది.

ఇక నుంచి ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయించనున్నారు.

ఇక ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలోనూ ఓ స్పష్టమైన విధానాన్ని ఇప్పటికే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.... ఇందుకు సంబంధించిన నిర్ణయాలపైనా మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోనుంది.

డీజిల్ సబ్సిడీపై...

రాష్ట్రంలోని మత్స్యకారులకు ఇచ్చే డీజీల్ సబ్సిడీని... లీటరుకు 6 నుంచి 9 రూపాయలకు పెంచే అంశానికి కూడా మంత్రులు సమ్మతి తెలపనున్నారు.

వేట నిషేధ సమయంలో ఇచ్చే పరిహారాన్ని 10 వేలకు పెంచే నిర్ణయాన్నీ ఆమోదించనుంది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యుల సంఖ్య పెంపు అంశానికి ఆమోదముద్ర వేయనున్నారు.

ఇందుకోసం ఆర్డినెన్సు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..