రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?
బంగారం ధరల్లో దూకుడు కనిపిస్తోంది. గత వారం రూ.34,000 మార్క్ దాటిన 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ.35,000 వైపు పరుగులు తీస్తోంది. మంగళవారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగింది. అంతర్జాతీయంగా మార్కెట్లు పాజిటీవ్‌గా ఉండటం, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ కారణంగా బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.34,470 కాగా 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.34,300. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.26,900. మరోవైపు కేజీ వెండి ధర రూ.110 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.39,200. కేజీ వెండి రూ.40,000 వైపు పరుగులు తీస్తోంది. 100 వెండి నాణేల ధర రూ.1,000 పెరిగింది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.81,000 కాగా, అమ్మకం ధర రూ.82,000.
ఇరాన్‌పై అమెరికా ఆంక్షలతో ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు ఇన్వెస్టర్లు. అందుకే కొంతకాలంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఈ వీకెండ్‌లో జీ-20 శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, చైనా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్‌ల మధ్య జరగనున్న వాణిజ్యపరమైన చర్చలపైనా దృష్టి పెట్టారు ఇన్వెస్టర్లు. మరోవైపు ఆర్థిక పరిస్థితులపై పోరాడేందుకు వచ్చే నెలలో ఫెడ్ రేట్లు తగ్గించే ఆలోచనలో ఉంది అమెరికా. ఇలా అనేక అంశాలు బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం రూ.35,000 మార్క్ దాటేందుకు ఎక్కువ రోజులేం పట్టదు.
Comments
Post a Comment