ఆరు వారాల వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు జులై 1న తిరిగి తెరుచుకోనుంది.

దిల్లీ: ఆరు వారాల వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు జులై 1న తిరిగి తెరుచుకోనుంది. రఫేల్‌ కేసులో రివ్యూ పిటిషన్లు, అయోధ్య భూవివాదం కేసు, రాహుల్‌ గాంధీపై కోర్టు ధిక్కారణ కేసు తదితర కీలక కేసులు వచ్చే నెలలో సర్వోన్నత న్యాయస్థానం ముందుకు రానున్నాయి. వీటిపై విచారణ జరిపి సంచలన తీర్పులు వెలువరించే అవకాశాలున్నాయి. 
దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య భూవివాదం కేసులో మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనేందుకు న్యాయస్థానం ఈ కమిటీకి ఆగస్టు 15 వరకు గడువిచ్చింది. ఆ తర్వాత కమిటీ నివేదికను పరిశీలించి అయోధ్య కేసులో కోర్టు తీర్పు వెల్లడించే అవకాశముంది. 
ఇక దీంతో పాటు రఫేల్‌ రివ్యూ పిటిషన్లు కూడా విచారణకు రానున్నాయి. రఫేల్‌ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని గతేడాది డిసెంబరులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అంగీకరించిన న్యాయస్థానం.. విచారణను జులైకి వాయిదా వేసింది. 
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కోర్టు ధిక్కరణ కేసులోనూ సుప్రీంకోర్టు వచ్చే నెలలో తీర్పు వెల్లడించనుంది. రఫేల్‌పై రివ్యూ పిటిషన్లను కోర్టు అంగీకరించడంతో ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అని తేలిందంటూ రాహుల్‌గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో సుప్రీం తీర్పును రాహుల్‌ తప్పుగా ఆపాదించారని ఆరోపిస్తూ భాజపా ఎంపీ మీనాక్షి లేఖీ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారంలో రాహుల్‌ బేషరతుగా క్షమాపణ చెప్పారు. తనపై కేసును కొట్టివేయాలని కోరారు. 
ఆరు వారాల పాటు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులిచ్చారు. అయితే సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు వెకేషనల్‌ బెంచ్‌లను ఏర్పాటుచేస్తారు. సెలవుల అనంతరం జులై 1 నుంచి కోర్టు సాధారణ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మరి ఈ కీలక కేసుల్లో కోర్టు ఎలాంటి సంచలన తీర్పులు వెలువరిస్తుందో వేచి చూడాలి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..