జమ్ముకశ్మీర్‌ అంశాన్ని స్వయంగా ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పరిష్కరించడం కన్నా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కి అప్పగించి ఉంటే ఈరోజు చరిత్ర మరోవిధంగా ఉండేది

దిల్లీ: జమ్ముకశ్మీర్‌ అంశాన్ని స్వయంగా ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పరిష్కరించడం కన్నా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కి అప్పగించి ఉంటే ఈరోజు చరిత్ర మరోవిధంగా ఉండేదని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌పై అందరికంటే తనకే ఎక్కువ అవగాహన ఉందని నెహ్రూ భావించడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయన్నారు. 370, 35ఏ పై భాజపా విధానాన్ని ఎవరైతే తిరస్కరిస్తున్నారో వారే ఒకప్పుడు వాటిని తాత్కాలిక పరిష్కారంలో భాగంగా రూపొందించిన విషయాన్ని విస్మరిస్తున్నారన్నారు. సదరు నిబంధనల తొలగింపుపై నెహ్రూ హయాంలో చర్చలు జరిగాయని.. అప్పట్లో హోంమంత్రిగా ఉన్న గుల్జారీలాల్ నందా ఈ అంశాన్ని లేవనెత్తారని తెలిపారు. అందుకు అప్పుడు అన్ని పార్టీలు మద్దతును ప్రకటించాయన్నారు. అనంతరం నందా ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిని రద్దు చేసే దిశగా పరిష్కార మార్గం కనుక్కోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారని తెలిపారు. కానీ, తదనంతరం జరిగిన అధికార బదిలీ పరిణామాలతో అంశం మరుగునపడిందన్నారు. అప్పటి నుంచి ఈ నిబంధనల్ని కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రాల అసెంబ్లీ కాలవ్యవధిని ఆరు సంవత్సరాల పొడగిస్తూ ఇచ్చిన ఆదేశాలు ఈ నిబంధనల నెపంతో కశ్మీర్‌లో ఇంకా కొనసాగుతున్నాయన్నారు. 
ఈ సందర్భంగా ఆయన ఎన్‌సీ తీరునూ విమర్శించారు. ఆర్టికల్‌ 370, 35ఏ విషయంలో ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. ఓవైపు 35ఏపై తేల్చేవరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనబోమని చెబుతూనే.. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగిందన్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్సే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శుక్రవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో మూడో వంతు భూభాగాన్ని పాకిస్థాన్‌కు కోల్పోవడానికి మాజీ ప్రధాన మంత్రి నెహ్రూయే కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. జులై 3 నుంచి జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించేందుకు ఉద్దేశించిన తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన శుక్రవారం బదులిచ్చారు. కాంగ్రెస్‌, మరికొన్ని పార్టీల వ్యతిరేకత నడుమ ఈ తీర్మానంతోపాటు జమ్ముకశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు-2019ను లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. గత ప్రభుత్వం జారీ చేసిన అత్యవసరాదేశం స్థానంలో రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..