ఏపీలో జోరుగా కూల్చివేతల పర్వం- జాబితాలో పలువురు పెద్దలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. ఏపీలో ప్రజావేదిక కూల్చివేతతో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభించిన వైసీపీ సర్కారు... రాష్ట్రవ్యాప్తంగా పలు అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, మీడియా పెద్దలతో పాటు పలువురికి చెందిన ఆస్తులు ఉన్నాయి. కొన్నేళ్లుగా వీరంతా అధికారాన్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చినట్లు జగన్ సర్కారు నిర్ధారణకు వచ్చింది. ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రారంభమైన అక్రమ కట్టడాల కూల్చివేత పర్వం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలో మాజీ సీఎం చంద్రబాబు నిర్మించిన ప్రజావేదికతో కూల్చివేతల పర్వాన్ని ప్రారంభించిన ప్రభుత్వం... కృష్ణానది కరకట్టపై ఉన్న ఇతర కట్టడాలకూ నిన్న నోటీసులు జారీ చేసింది. ఇందులో పలువురు ప్రముఖులకు చెందిన నిర్మాణాలు ఉన్నాయి. కేవలం చంద్రబాబుపై కక్షసాధింపు కోసమే ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏ ఒక్క అక్రమ నిర్మాణాన్నీ వదలొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల అక్రమ కట్టడాల కూల్చివేతకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఉండవల్లిలో కృష్ణానది కరకట్టపై ప్రజావేదిక కూల్చివేత ప్రారంభం కాగానే ఇతర కట్టడాలకూ నోటీసుల పర్వం ప్రారంభమైంది. ఇందులో మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్స్ తో పాటు కరకట్టపై ఇతర కట్టడాలూ ఉన్నాయి. దీంతో కరకట్టపై తన ఆశ్రమం జోలికి రావొద్దని శివస్వామి జగన్ ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్స్ కు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అనుమతులు ఇచ్చారంటూ ఓవైపు ఆరోపిస్తున్న టీడీపీ... అదే సమయంలో అక్రమ నిర్మాణం పేరుతో ప్రభుత్వం ఏ క్షణాన కూల్చివేతకు దిగుతుందోనని ఆందోళన చెందుతోంది. దీంతో రెండు రోజుల్లోగా చంద్రబాబుకు మరో నివాసం కోసం తీవ్రంగా అన్వేషణ సాగిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి గుంటూరులోని తన నివాసాన్ని చంద్రబాబుకు ఆఫర్ చేశారు. అలాగే విజయవాడలోని గ్రావెల్ ఇండియా, క్వాలిటీ ఐస్ క్రీమ్ సంస్ధలకు చెందిన గెస్ట్ హౌస్ లను చంద్రబాబు నివాసం కోసం పరిశీలిస్తున్నారు. అలాగే సోమవారం నుంచి టీడీపీ కార్యకలాపాలను గుంటూరుకు మార్చారు.

అక్రమ నిర్మాణాలపై వైసీపీ సర్కారు చేపట్టిన కూల్చివేతల పర్వం రాష్ట్రంలో మీడియా సంస్ధలకూ పాకింది. నిన్న తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయానికి గోదావరి అర్బన్ డెపలప్ మెంట్ అధారిటీ(గుడా) నోటీసులు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి అదనపు ఫ్లోర్లు వేసిన ఆంధ్రజ్యోతి యాజమాన్యం దీనిపై స్పందించాలని లేకుంటే కూల్చివేత తప్పదని గుడా అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఈ స్ధలంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తోంది. దీంతో ఆంధ్రజ్యోతి సంస్ధ ఎండీ రాధాకృష్ణ కుమార్తె అనూష పేరుతో గుడా నోటీసులు ఇచ్చింది.

అక్రమ కట్టడాల జాబితాలో రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలకు చెందిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతూ క్షేత్రస్ధాయిలో అధికారుల నుంచి ఉన్నతాధికారులకు వినతులు వస్తున్నాయి. దీంతో ఎవరినీ ఉపేక్షించవద్దన్న ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసి తీరాలని వారికి సమాధానం వస్తోంది. ఈ దిశగా ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలకు, మాజీ ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన అధికారులు.. త్వరలో వాటిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..