టాప్ 10 న్యూస్‌ - 10 AM,

1. గోడ కూలి 14 మంది మృతి

మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. పుణెలోని కుంద్వా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున గోడ కూలి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కుంద్వా ప్రాంతంలో నిలిపి ఉన్న ఆటోలు, కార్లపై గోడ కూలడంతో మృతుల సంఖ్య పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్త వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పదిలో అంతర్గత మార్కుల తొలగింపు

ఏపీలో పదోతరగతిలో అంతర్గత మార్కులను తొలగిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 80% మార్కులకు రాతపరీక్ష, 20% అంతర్గత మార్కులు ఉండేవి. ఈ విధానంలో ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా అంతర్గత మార్కులు వేసుకుంటున్నట్లు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సు మేరకు అంతర్గత మార్కులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కూల్చివేతపై స్టేకు హైకోర్టు నిరాకరణ

అసెంబ్లీ నిర్మాణ నిమిత్తం హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లో భవనాల కూల్చివేత పనులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను శుక్రవారం హైకోర్టు తిరస్కరించింది. అవి చారిత్రక పరిరక్షణ చట్టం జాబితాలో లేనపుడు చారిత్రక నిర్మాణంగా భావించలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్య సగానికి తగ్గినప్పటికీ అధిక విస్తీర్ణంలో భవనం నిర్మించాల్సిన అత్యవసరం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొత్త భవనం నిర్మించాల్సిన పరిస్థితులతో పాటు భవన నిర్మాణ ప్రణాళికలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆంధ్రాలో లక్షమంది డాక్టర్లు

ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది డాక్టర్లు ఉన్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తర్వాత అత్యధిక మంది డాక్టర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని వెల్లడించింది. ఆయా రాష్ట్రాల మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ కౌన్సిళ్ల దగ్గర నమోదైన పేర్ల ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.  దేశంలో డాక్టర్ల కొరతపై శుక్రవారం లోక్‌సభలో అడిగిన ఓ లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వనీకుమార్‌ చౌబే ఈ మేరకు సమాధానం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 10 ఎకరాలున్నా పింఛను

సామాజిక భద్రత పింఛన్ల ఎంపికకు ఇప్పటి వరకు ఉన్న భూమి నిబంధనను ఏపీ ప్రభుత్వం సడలించనుంది. ప్రస్తుతం 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూములున్న పేదలకు పింఛన్లు ఇస్తున్నారు. కొత్త ప్రభుత్వం 5 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూములున్న వారికి కూడా పింఛను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కశ్మీర్‌లో దుస్థితికి కాంగ్రెసే కారణం

జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్సే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దుయ్యబట్టారు. ఆ రాష్ట్రంలో మూడో వంతు భూభాగాన్ని పాకిస్థాన్‌కు కోల్పోవడానికి మాజీ ప్రధాన మంత్రి నెహ్రూయే కారణమన్నారు. జులై 3 నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించేందుకు ఉద్దేశించిన తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన శుక్రవారం బదులిచ్చారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల విధానాల వల్ల జమ్మూకశ్మీర్‌కు దేశానికి మధ్య అంతరం పెరిగిందని షా ఆరోపించారు. దీన్ని పూడ్చడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వణికిస్తున్న సైలెక్స్‌ మాల్‌వేర్‌

డేటా ఆధారంగా పనిచేసే ‘ఐఓటీ’ ఉపకరణాలే లక్ష్యంగా ‘‘సైలెక్స్‌’’ అనే కొత్త మాల్‌వేర్‌ ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోంది. మోడెమ్‌లు, స్మార్ట్‌ టీవీలు-ఫోన్లు, ట్యాబ్లెట్లు, మల్టీమీడియా ప్లేయర్లు, ‘ఏఆర్‌ఎం’ ప్రాసెసర్లను పని చేయకుండా చేస్తోంది. ఐరోపాకు చెందిన 14 ఏళ్ల బాలుడు మరో ఇద్దరు మిత్రులతో కలసి దీన్ని సృష్టించాడు. ఈ బాలుడు ఐరోపాలో కూర్చుని మాల్‌వేర్‌ వ్యాపింపజేస్తూ ఇరాన్‌లో ఉండే సర్వర్ల నుంచి వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు భ్రమింపజేస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 15రోజుల్లోగా అప్పులు కట్టండి.. లేదంటే..

రుణాలు ఎగ్గొట్టే బడా బాబులపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కఠిన చర్యలకు దిగింది. ఫార్మా, వజ్రాల వ్యాపారం, విద్యుత్‌ రంగాలకు చెందిన 10 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల పేర్లను బయటకు వెల్లడించింది. వీరంతా 15 రోజుల్లోగా వడ్డీతో సహా అప్పులు కట్టాలని.. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ పది మంది ఎస్‌బీఐ నుంచి దాదాపు రూ. 1500కోట్ల వరకూ రుణాలు తీసుకున్నారట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దేశంలో ఖరీదైన నగరం ముంబయి

దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ముంబయి నిలిచింది. ఆసియాలో చూస్తే తొలి 20 స్థానాల్లో చోటు దక్కించుకోగా, ప్రపంచంలో 67వ ర్యాంకు సాధించింది. గ్లోబల్‌ కన్సల్టింగ్‌ లీడర్‌ మెర్సర్‌ సర్వే నివేదిక ప్రకారం ఆహార, వినియోగ వస్తువుల ధరలు ముంబయిలో తగ్గినప్పటికీ, నివాస గృహాల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. లంక... కష్టమే ఇక..!

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండ్‌ జోరుతో అదరగొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో శ్రీలంకను మట్టికరిపించింది. ప్రిటోరియస్‌ (3/25), మోరిస్‌ (3/46), రబాడ (2/36) విజృంభించడంతో మొదట శ్రీలంక 49.3 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది. కుశాల్‌ పెరీరా (30), ఫెర్నాండో (30) టాప్‌ స్కోరర్లు. డుప్లెసిస్‌ (96 నాటౌట్‌), ఆమ్లా (80 నాటౌట్‌) రాణించడంతో లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 37.2 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఈ ఓటమితో శ్రీలంక సెమీఫైనల్‌ అవకాశాలు చాలా సంక్లిష్టమయ్యాయి.కేపి

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..