‘క‌ల్కి’.. హనుమంతుడు దారి చూపినా యుద్ధం చేయని రాముడు..


రేటింగ్: 3/5

న‌టీన‌టులు:

రాజ‌శేఖ‌ర్, అదాశ‌ర్మ‌, నాజ‌ర్, రాహుల్ రామ‌కృష్ణ‌, సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌
సంగీతం: శ‌్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్
క‌థ‌, స్కీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: ప‌్ర‌శాంత్ వ‌ర్మ‌

గ‌రుడ‌వేగ సినిమా త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ న‌టించిన సినిమా కావ‌డంతో ముందు నుంచి కూడా క‌ల్కిపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. పైగా టీజ‌ర్ కూడా బాగానే ఉండ‌టంతో ఆస‌క్తి పెరిగిపోయింది. మ‌రి నిజంగానే ఈ చిత్రం ఆక‌ట్టుకుంటుందా..?

క‌థ‌:

న‌ర్స‌ప్ప‌(అశుతోష్ రానా) కొల్లాపూర్‌లో ఓ రాక్ష‌సుడు లాంటి ఎమ్మెల్యే. అడ్డొచ్చిన వాళ్ల‌ను చంపేస్తుంటాడు. ఆయ‌న త‌మ్ముడు శేఖ‌ర్ బాబు(సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌) జాత‌ర‌లో హత్య‌కు గుర‌వుతాడు. ఆ కేసును ఛేధించ‌డానికి కొల్లాపూర్ వ‌స్తాడు ఐపిఎస్ ఆఫీస‌ర్ క‌ల్కి(రాజ‌శేఖ‌ర్). కానీ ఆ ఊళ్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఒక్క‌రి చావుతో మొద‌లైన ఇన్వెస్టిగేష‌న్ కాస్తా వంద‌ల చావుల‌కు చేరిపోతుంది. అస‌లు కొల్లాపూర్ లో ఏం జ‌రుగుతుంది.. క‌ల్కి ఆ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీల‌ను చేధించాడా లేదా.. అత‌డికి జ‌ర్న‌లిస్ట్(రాహుల్ రామకృష్ణ‌) చేసిన సాయం ఏంటి అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:

గరుడవేగ తర్వాత రాజశేఖర్ చేసిన సినిమా కావడంతో.. కల్కి సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. దానికి తోడు టీజర్ ట్రైలర్ కూడా బాగుండటంతో సినిమాలో విషయం కూడా బాగానే ఉంటుందని నమ్మకంతోనే థియేట‌ర్స్ కు వ‌స్తున్నారు ప్రేక్ష‌కులు. అయితే ఇప్పటికే ఎన్నో సార్లు చూసిన మర్డర్ మిస్టరీని ఈ సినిమాలో మరోసారి చూపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.. కాకపోతే అది 1983 నేపథ్యంలో చిత్రీకరించాడు. రాజవంశం నుంచి మొదలుపెట్టి నిరంకుశత్వం వరకు సాగే ఒక ఊరు పెద్ద చేసే అరాచకమే ఈ కల్కి సినిమా. అ.. లాంటి భిన్నమైన సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ కల్కితో పక్కా కమర్షియల్ రూట్ లోకి వచ్చాడు. హీరో కొడితే గాల్లోకి ఎగరడం.. ఒక్కడే వచ్చి 100 మందిని నరకడాలు.. ఇవన్నీ రెండో సినిమాకే బాగా ఒంట పట్టించుకున్నాడు ప్రశాంత్ వర్మ. అవ‌న్నీ రాజ‌శేఖ‌ర్ తో చేయించ‌డం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. గ‌రుడ‌వేగ‌లో చాలా సెటిల్డ్ ప‌ర్ఫార్మెన్స్ చేసిన ఈయ‌న‌.. క‌ల్కిలో మాత్రం కాస్త ఓవ‌ర్ అయిపోయాడేమో అనిపించింది.
కొడితే గాల్లోకి ఎగ‌ర‌డం అనేంత ఇమేజ్ ఇప్పుడు ఈయ‌న‌కు లేదు. ఓవైపు పక్క కమర్షియల్ కథ చెబుతూనే.. మరోవైపు భిన్నమైన స్క్రీన్ ప్లేతో కథను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు ఈ దర్శకుడు. ఫస్టాఫ్ చాలా వరకు ఆసక్తికరంగా సాగింది. ఆ ఊరు.. ఊర్లో జరిగే మర్డర్లు.. వాటిని కనుక్కోవడానికి వచ్చే పోలీస్ ఆఫీసర్.. జర్నలిస్టు.. ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ బాగానే అనిపించాయి. కానీ ఇంటర్వెల్ తర్వాత మాత్రం అనుకున్నంత ఆసక్తికరంగా కల్కి సినిమా సాగలేదేమో అనిపించింది. కన్ఫ్యూజన్ లేకుండా కథ క్లారిటీగానే చెప్పినా.. మరీ రొటీన్ కథ కావడం ఒక్కటే కల్కికి మైనస్.. గరుడవేగ తర్వాత సినిమా కాబట్టి ఓపెనింగ్స్ వరకు ఓకే కానీ.. రాజశేఖర్ కోరుకున్న బ్రేక్ మాత్రం ఈ సినిమాతో రావడం కష్టమే.

న‌టీన‌టులు:

రాజ‌శేఖ‌ర్ మ‌రోసారి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేష‌న్ చేస్తున్నంత సేపు బాగానే అనిపించింది కానీ యాక్ష‌న్ అండ్ రొమాంటిక్ స‌న్నివేశాల్లో మాత్రం ఇబ్బందిగా క‌నిపించాడు రాజ‌శేఖ‌ర్. ఇక రాహుల్ రామ‌కృష్ణ మాత్రం అద్భుతంగా న‌టించాడు. ఆయ‌న కెరీర్లో మైల్ స్టోన్ రోల్ ఇది. అశుతోష్ రానా కూడా రాక్ష‌సంగా ఉన్నాడు. చాలా కాలం త‌ర్వాత తెలుగులో చేసిన సినిమా ఇది. అదా శ‌ర్మ కాసేపు ఉన్నా ప‌ర్లేదు. నాజ‌ర్, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, నందితా శ్వేతా, శ‌త్రు లాంటి వాళ్లు కూడా చిన్న పాత్ర‌ల‌కే ప‌రిమితం అయిపోయారు.

టెక్నిక‌ల్ టీం:

శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ముఖ్యంగా ఆర్ఆర్ కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఎడిటింగ్ ఫ‌స్టాఫ్ వ‌ర‌కు బాగానే ఉన్నా సెకండాఫ్ మాత్రం గాడి త‌ప్పింది. చివ‌రి అరగంట మాత్రం బాగుంది. సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. విజువ‌ల్స్ అన్నీ బాగా క్యాప్చ‌ర్ చేసారు. ఇక ద‌ర్శ‌కుడిగా ప్ర‌శాంత్ వ‌ర్మ అంత‌గా ఆక‌ట్టుకోలేదు. యావ‌రేజ్ మార్కుల‌తో స‌రిపెట్టుకున్నాడు. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ను స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో కాస్త కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేసాడు కానీ అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

చివ‌ర‌గా ఒక్క‌మాట‌:
క‌ల్కి.. హ‌నుమంతుడు దారి చూపినా రాముడు యుద్ధం స‌రిగ్గా చేయ‌లేదు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది