డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే రూ.5,000... డ్రంకెన్ డ్రైవ్‌కు రూ.10,000... కొత్త రూల్స్ రెడీ
భరత్ అనే నేను సినిమాలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినవారి నుంచి వేలకు వేల రూపాయలు జరిమానా వసూలు చేయాలని ముఖ్యమంత్రి మహేష్ బాబు ఆదేశాలిచ్చే సీన్ గుర్తుందా? ఆ సీన్ నిజజీవితంలో మీకు ఎదురయ్యే అవకాశముంది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న మోటార్ వాహనాల చట్టానికి పదును పెంచుతోంది కేంద్రం. ఇకపై డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే రూ.5,000 జరిమానా చెల్లించి రావొచ్చు. ఈ మేరకు మోటార్ వాహనాల చట్టానికి సవరణలు చేస్తోంది కేంద్రం. సవరించిన బిల్లును గత సోమవారం కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లింది. ఈ బిల్లు త్వరలో పార్లమెంట్ ముందుకు చర్చకు రానుంది. ఈ బిల్లును 2016లోనే రూపొందించారు. రాజ్యసభ ఆమోదముద్ర పడలేదు. ఇంతలో 16వ లోక్‌సభ ముగియడంతో బిల్లు ల్యాప్స్ అయింది.
ప్రస్తుతం పార్లమెంట్ సెషన్‌లో మోటార్ వాహనాల చట్టం సవరణ బిల్లు మరోసారి తెరపైకి వచ్చింది. కొత్త కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. పార్లమెంట్‌లో చర్చకు రానుంది. ప్రయాణికుల భద్రత కోసం కఠిన నిబంధనలు, భారీ జరిమానాలు తప్పవని భావిస్తోంది కేంద్రం. అందుకే మోటార్ వెహికిల్స్ చట్టానికి పదును పెంచుతోంది. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు జరిమానాలు పెంచడం మాత్రమే కాదు... దేశమంతా ఒకే డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం నేషనల్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సైట్స్ ఏర్పాటు చేయనుంది. అంతేకాదు... డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఆధార్ తప్పనిసరి చేయనుంది.
ఒకవేళ ఈ బిల్లుకు ఆమోదముద్ర పడితే కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇందుకోసం కొన్ని రోజుల సమయం పట్టొచ్చు. నిబంధనలు అమలులోకి వస్తే మాత్రం ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు చెల్లించక తప్పదు. లైసెన్స్ లేకుండా వాహనం డ్రైవ్ చేస్తే ప్రస్తుతం రూ.500 జరిమానా ఉంది. కొత్త నిబంధనల ప్రకారం రూ.5,000 చెల్లించాలి. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ప్రస్తుతం రూ.1,000 ఉన్న జరిమానా రూ.5,000 కానుంది. డ్రంకెన్ డ్రైవ్‌కు రూ.10,000 జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోయినా రూ.10,000 జరిమానా చెల్లించాలి. మరి బైక్ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం మీకు అలవాటా? కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్ రాగానే లిఫ్ట్ చేస్తుంటారా? అయితే జాగ్రత్త.
Comments
Post a Comment