టాప్ 10 న్యూస్

1. అయోధ్య తీర్పు నేడే

యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం 10.30కు ఈ తీర్పును వెలువరించనుంది. 

2. వదంతులు వ్యాప్తి చేస్తే బేడీలే. 

అయోధ్య వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో మీకొచ్చిన సందేశాన్ని మరొకరికి పంపించారంటే కోరి చిక్కులు తెచ్చుకున్నట్లే. అయోధ్య తీర్పుపై వచ్చే సందేశాలను ‘డిలీట్‌’ చేయాలని శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్‌ వెల్లడించారు. ఎవరైనా వాటిని మరొకరికి కాని, మరో గ్రూప్‌నకు కాని పంపిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

3. నేడే కర్తార్‌పుర్‌ నడవా ప్రారంభం
సిక్కులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ‘కర్తార్‌పుర్‌ నడవా’ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి గురుదాస్‌పుర్‌లోని డేరాబాబా నానక్‌ వద్ద ఏకీకృత చెక్‌పోస్ట్‌ (ఐసీపీ)ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

4. నేడు సకల జనుల సామూహిక దీక్ష
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ట్యాంక్‌బండ్‌పై శనివారం సకలజనుల సామూహిక దీక్షకు రాజకీయ పార్టీలు మద్దతుగా ప్రకటించాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు సాగే ఈ దీక్షలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల అధ్యక్షులు పాల్గొంటారని నేతలు ప్రకటించారు.   

5. ఐదేళ్లలో రాష్ట్రానికి  రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ముందుకొస్తున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పెట్రోలు, సహజవాయువు, ఉక్కు రంగాల్లో రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నట్లు చెప్పారు. విశాఖలో విస్తరణ ప్రాజెక్టులు, కాకినాడలో పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటు, కడపలో ఉక్కు కర్మాగారం ద్వారా ఈ పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు.  

6. ప్రజల హక్కులను పరిరక్షించే సంస్థలకే దిక్కు లేదా?
ప్రజల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించే సంస్థలైన లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ పోస్టులను భర్తీ చేయకపోవడంపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పోస్టులు ఏళ్లతరబడి ఖాళీగా ఉన్నా పట్టించుకోకపోవడం సరికాదంది. ఈ పోస్టులను భర్తీ చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. వచ్చే విచారణ నాటికి భర్తీ చేస్తారని ఆశిస్తున్నామంటూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.  

7. నచ్చిన ఆకృతిలో.. వారంలో ఇల్లు సిద్ధం!
రోబోటిక్‌ త్రీడీ సాంకేతికతతో నచ్చిన ఆకృతిలో వారం రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేయవచ్చని ఒజాజ్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం శివారులో ఈ సాంకేతికతను ఉపయోగించి వంద చదరపు అడుగుల్లో నిర్మించిన గదిని శుక్రవారం వీరు మీడియా ప్రతినిధుల ఎదుట ప్రదర్శించారు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సాంకేతికతను అందుబాటులోకి తెస్తామని వివరించారు.  

8. అత్యుత్తమ నేత నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యుత్తమ నేత అంటూ అమెరికాకు చెందిన అపర కుబేరుడు రే డెలియో కొనియాడారు. ‘‘ప్రపంచ ఉత్తమ నాయకుల్లో ఒకరు.. మోదీ ఎలా ఆలోచిస్తారు..ఏమి ఆలోచిస్తారు అన్నది తెలుసుకొనేందుకు  ఇటీవల నాకు అవకాశం లభించింది. మోదీ దేశంలోని ధనికులకో లేదా పేదలకో ప్రాతినిధ్యం వహించడం లేదు. ఆయన అన్ని వర్గాల వ్యక్తి.  ఎన్నో అద్భుతాలు సాధించారు. ప్రజల పురోగతి కోసం భారీ ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తున్నారు’’అని ట్వీట్‌ చేశారు. 

9. అధ్యక్ష రేసులో బ్లూంబర్గ్‌
అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి న్యూయార్క్‌ మాజీ మేయర్‌ మైఖేల్‌ బ్లూంబర్గ్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఆయన భారత్‌తో దృఢమైన సంబంధాలు ఉండాలని గట్టిగా కోరుకునే నేత. అలబామా రాష్ట్రం నుంచి పోటీ చేయనున్నారు.

10. సాత్విక్‌ జోడీ అదుర్స్‌
భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి జోడీ అదరగొడుతోంది. చైనా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో మూడో ర్యాంకు జోడీకి షాకిచ్చి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 21-19,  21-15తో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత, మూడో సీడ్‌ జున్‌ హుయ్‌- యు చెన్‌ (చైనా) జంటపై సంచలన విజయం సాధించింది...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..