పొగ తాగే అలవాటున్న వారు ఈ-సిగరెట్లకు మారినట్లయితే వారి గుండె ఆరోగ్య పరిస్థితి కొన్ని వారాల్లోనే మెరుగుపడుతుంది

పొగ తాగే అలవాటున్న వారు ఈ-సిగరెట్లకు మారినట్లయితే వారి గుండె ఆరోగ్య పరిస్థితి కొన్ని వారాల్లోనే మెరుగుపడుతుందని ఈ అంశంపై నిర్వహించిన ఒక పెద్ద అధ్యయనంలో వెల్లడైంది.


ధూమపానం చేసే 114 మంది మీద నెల రోజుల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. ధూమపానానికి బదులు వేపింగ్ వల్ల - అంటే ఈ-సిగరెట్లు తాగటం వల్ల గుండె పోటు, మెదడు పోటు ముప్పు తగ్గే అవకాశం ఉందని తేలింది.
అయితే.. వేపింగ్ అనేది ''సురక్షితం కాదు'' అని ఈ అధ్యయనం నిర్వహించిన యూనివర్సిటీ ఆఫ్ డండీకి చెందిన పరిశోధకుల బృందం స్పష్టం చేసింది. కాకపోతే పొగాకు కన్నా తక్కువ హానికరమని చెప్పింది.
అసలు పొగతాగటం పూర్తిగా మానివేయటమే.. గుండెకు అత్యంత మేలు చేస్తుందని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ పేర్కొంది.
సిగరెట్ల పొగలోని రసాయనాల వల్ల.. గుండె ధమనుల్లో రక్త ప్రసరణ జరిగే మార్గాలు సన్నగా మారిపోతాయి. వాటిలో కొవ్వు నిల్వలు పేరుకోవటం వల్ల అవి అడ్డంకిగా మారి, దారి మూసుకుపోయి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. చివరికి పొగతాగేవారికి గుండె పోటు ముప్పు రెట్టింపు అవుతుంది.


అయితే.. వేపింగ్‌కు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధారాలు చాలా తక్కువని.. తరచుగా గుండె ఆరోగ్యం మీద ఒక ఈ-సిగరెట్ చూపే ప్రభావాన్ని మాత్రమే అంచనావేయటం జరుగుతోందని పరిశోధకులు పేర్కొన్నారు.
దీంతో.. తాజా అధ్యయనంలో పొగతాగే వారు కొందరు ఈ-సిగరెట్‌కు మారిన తర్వాత వారి రక్త నాళాల మీద నెల రోజుల పాటు అధ్యయనం చేశారు.
ఒక రక్తపు అల ప్రవహించేటపుడు ఈ రక్త నాళాలు ఎలా వ్యాకోచిస్తాయనే దాని మీద దృష్టి కేంద్రీకరించారు.
రక్త నాళాలు ఎంత ఎక్కువగా వ్యాకోచించగలిగితే.. అవి అంత ఎక్కువ ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ రక్తప్రసరణ వ్యాకోచం స్కోర్లకు - దీర్ఘకాలంలో గుండె పోటు, మెదడు పోటు ప్రమాదానికి సంబంధం ఉంది.



జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురించిన ఈ అధ్యయన ఫలితాలు మూడు అంశాలను చూపుతున్నాయి:

పొగ తాగని ఆరోగ్యవంతమైన వారిలో ఈ స్కోరు 7.7 శాతంగా ఉంది

పొగ తాగే వారిలో ఈ స్కోరు 5.5 శాతంగా ఉంది

నికొటిన్ నుంచి ఈ-సిగరెట్లకు మారిన వారిలో నెల రోజుల్లో ఈ స్కోరు 6.7 శాతానికి పెరిగింది.

కాబట్టి.. ఈ ధూమపాన ప్రియులు వేపింగ్‌కు మారటం వల్ల నెల రోజుల్లోనే సగం మేరకు ఆరోగ్యవంతమైన స్థితికి చేరుకున్నారు.
''అవి పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. కానీ.. రక్త నాళాల పనితీరు కేవలం నెల రోజుల్లోనే గణనీయంగా మెరుగుపడింది'' పని పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ జాకబ్ జార్జ్ చెప్పారు.
ఈ మెరుగుదల.. దీర్ఘకాలం పాటు స్థిరంగా కొనసాగుతుందా అనేది కానీ, వేపింగ్‌కు మారటం వల్ల ప్రాణాలకు ఖచ్చితంగా రక్షణ లభిస్తుందా అనేది కానీ పూర్తిగా నిర్ధారించటానికి ఈ అధ్యయనం సరిపోదు.
వేపర్లకు సాధారణ స్కోరు లభించలేదన్న విషయాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి.




''గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ డివైజ్‌లు పూర్తిగా సురక్షితమైనవి కాదు.. ధూమపానం చేయనివారు, పిల్లలు వీటిని వాడకూడదు'' అంటారు ప్రొఫెసర్ జార్జ్.
అయితే.. పొగాకు సిగరెట్ల కన్నా ఇవి తక్కువ ప్రమాదకరమనేందుకు స్పష్టమైన ఆధారం ఇప్పుడు మనకు లభించిందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. ఈ-సిగరెట్ల వల్ల తాను దాదాపు చనిపోయే పరిస్థితి ఎలా వచ్చిందనేది ఒక బ్రిటిష్ టీనేజర్ బీబీసీకి వివరించినపుడు.. వేపింగ్ వల్ల పొంచివున్న ప్రమాదాలు ఎటువంటివనేది బలంగా తెలిసివచ్చింది.
ఈ డివైజ్‌లు.. అతడి ఊపిరితిత్తుల్లో ఒక ప్రాణాంతక రోగనిరోధక ప్రతిక్రియను కలిగించాయి. దీనివల్ల అతడు కృత్రిమ ఊపిరితిత్తి సాయంతో ఆస్పత్రిలో కృత్రిమ శ్వాస అందుకుంటూ చికిత్స పొందాల్సి వచ్చింది.
మొత్తంమీద.. ధూమపానం కన్నా వేపింగ్ అనేది 95 శాతం సురక్షితమైనదని.. పొగ తాగే వారు ఈ-సిగరెట్లకు మారాలని, పొగ తాగని వారు వేపింగ్ జోలికి కూడా పోవద్దని బ్రిటన్‌లో నిపుణులు సలహా ఇస్తున్నారు.
ధూమపానం వల్ల సంభవించే గుండె జబ్బుల వల్ల ప్రతి రోజూ 50 మంది చనిపోతున్నారని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ చెప్తోంది.
''మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ధూమపానం మానివేయటమే అత్యుత్తమ మార్గం'' అని ఆ స్వచ్ఛంద సంస్థ స్పష్టంచేస్తోంది.
''ధూమపానం నుంచి వేపింగ్‌కు మారిన వారిలో గుండె సంబంధిత జబ్బుల ప్రమాద స్థాయి తగ్గుతుందని ఈ అధ్యయనం స్పష్టమైన ఆధారాలను అందించింది'' అని యూనివర్సిటీ ఆఫ్ నాటింగామ్‌కు చెందిన యూకే సెంటర్ ఫర్ టొబాకో అండ్ ఆల్కహాల్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ జాన్ బ్రిటన్ పేర్కొన్నారు.
''పొగాకు పొగలో కన్నా వేపర్‌లో కాలుష్య ఉద్గారాల స్థాయి, తీవ్రత తక్కువ కాబట్టి... ధూమపానం కన్నా వేపింగ్ తక్కువ హానికరమని ఈ అధ్యయనంలో వెల్లడైన విషయం సరైనదే'' అని చెప్పారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..