అయోధ్య తీర్పు చెప్పే న్యాయమూర్తులు వీరే.

అయోధ్య తీర్పు చెప్పే న్యాయమూర్తులు వీరే..
ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ నజీర్ ముస్లిం న్యాయమూర్తి. ఈ కేసులో ఆగస్టు 6 నుంచి రోజువారీగా కేసును విచారించిన రాజ్యాంగ ధర్మాసనం.. శనివారం తీర్పు చెప్పబోతోంది

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసులో శనివారం  తుది తీర్పు వెలువడనుంది.  అయోధ్య భూవివాదం కేసులో  ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పబోతోంది.  సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యం వహిస్తారు. జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లు ధర్మాసనంలోని ఇతర నలుగురు సభ్యులు.  ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ నజీర్ ఒక్కరే ముస్లిం న్యాయమూర్తి. ఈ కేసులో ఆగస్టు 6 నుంచి రోజువారీగా కేసును విచారించిన రాజ్యాంగ ధర్మాసనం.. శనివారం తీర్పు చెప్పబోతోంది.


1. జస్టిస్ రంజన్ గొగోయ్, భారత ప్రధాన న్యాయమూర్తి

ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఈ బెంచ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. 3 అక్టోబర్ 2018 న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 18, 1954 న జన్మించిన జస్టిస్ రంజన్ గొగోయ్ 1978 లో బార్ కౌన్సిల్‌లో చేరారు.  గౌహతి  హైకోర్టుతో  న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 2001 లో గౌహతి హైకోర్టులో న్యాయమూర్తిగా  గొగోయ్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2010 లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 లో  పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.  2012 , ఏప్రిల్ 23 న  జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు.

2. జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే (ఎస్‌ఏ బొబ్డే)
ఈ ధర్మాసనంలో రెండవ న్యాయమూర్తి జస్టిస్ ఎస్. ఏ బోబ్డే.  1978 లో మహారాష్ట్రలోని బార్ కౌన్సిల్‌లో చేరారు. అనంతరం బాంబే హైకోర్టు బొంబాయి బెంచ్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు.  1998 లో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. 2000లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.  అనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు బొబ్డే. ఇక 2013 లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ ఎస్. ఏ. బొబ్డే ఏప్రిల్ 23, 2021 న పదవీ విరమణ చేయనున్నారు.

3. జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్
జస్టిస్ డి.వై.చంద్రచుడ్ 2016, మే  13 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్ డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టుకు రాకముందు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.  బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు.  ప్రపంచంలోని అనేక పెద్ద విశ్వవిద్యాలయాలలో జస్టిస్ డి.వై.చంద్రచుడ్ ఉపన్యాసాలు ఇచ్చారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టక ముందు  దేశానికి అదనపు సొలిసిటర్ జనరల్. శబరిమల, భీమా కోరెగావ్, స్వలింగసంపర్కంతో సహా పలు పెద్ద కేసుల్లో ఆయన బెంచ్‌లో భాగమయ్యారు.

4. జస్టిస్ అశోక్ భూషణ్
ఉత్తరప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అశోక్ భూషణ్ జౌన్‌పూర్‌లో జన్మించారు.  1979లో యుపి బార్ కౌన్సిల్‌లో చేరారు. అనంతరం అలహాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. అలహాబాద్ హైకోర్టులో అనేక పోస్టులలో ఆయన పనిచేశారు. అశోక్ భూషణ్  2001 లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా, 2015 లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016, మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు అశోక్ భూషణ్.

5. జస్టిస్ అబ్దుల్ నజీర్
అయోధ్య కేసు బెంచ్‌లో ఉన్న జస్టిస్ అబ్దుల్ నజీర్ 1983 లో  న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఆయన కర్ణాటక హైకోర్టులో  లాయర్‌గా నజీర్ ప్రాక్టీస్ చేశారు. ఆ తరువాత అదనపు న్యాయమూర్తి,  శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు.  2017, ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు నజీర్.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..