టాప్ 10 న్యూస్...

1. పోరాడిన కోహ్లీ

భారత్‌, వెస్టిండీస్‌ మధ్య చివరిదైన రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సారథి విరాట్‌ కోహ్లీ(76), ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(55) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. పుజారా(6) ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ప్రస్తుతానికి క్రీజులో హనుమ విహారి(42 బ్యాటింగ్‌), రిషబ్‌ పంత్‌(27 బ్యాటింగ్‌) ఉన్నారు. 

2. మెగా విలీనం

గత శుక్రవారం వాహన వంటి పలు రంగాలకు ఉద్దీపన చర్యలు ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే ఈ శుక్రవారం కూడా బ్యాంకింగ్‌ సంస్కరణలకు తెరలేపారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద బ్యాంకులు ఉండాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి తగినట్లుగా.. 10 బ్యాంకులను విలీనం చేసి 4 దిగ్గజ బ్యాంకులను తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే మిగులుతాయి. 

3. తెలంగాణకు 59.01.. ఏపీకి 152 టీఎంసీలు

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాల నుంచి తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేస్తూ శుక్రవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. సెప్టెంబరు నెల వరకు కేటాయించిన వాటాలను రెండు రాష్ట్రాలకు విడుదల చేయాలని ఆయా జలాశయాల ముఖ్య ఇంజినీర్లను ఆదేశించారు. తెలంగాణ తాగు, సాగు నీటి అవసరాలకు రెండు జలాశయాల నుంచి 59.01 టీఎంసీలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు జలాశయాల నుంచి 152 టీఎంసీల కేటాయింపు జరిగింది.

4. నెల్లూరుకు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం

ప్రతిష్ఠాత్మక ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం నెల్లూరుకు తరలిరానుంది. కేంద్ర ప్రభుత్వం తెలుగు కేంద్రం ఏర్పాటుకు గతంలో అనుమతిచ్చినా, తెలుగు రాష్ట్రాల నడుమ ఏకాభిప్రాయం కుదరకపోవటంతో, కర్ణాటకలోని మైసూరులో దాన్ని ప్రారంభించారు. తాజాగా దాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు తరలించాలని కేంద్ర మానవ వనరులశాఖ నిర్ణయించింది. ప్రస్తుతానికి కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌కు మార్చారని, ఇతర పాలనాపరమైన అంశాలు త్వరలో చేపట్టనున్నట్టు  సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

5. రూ.కోటి దాటే నగదు

రూ.కోటిని మించే నగదు ఉపసంహరణలపై మూలం వద్ద 2 శాతం పన్ను మినహాయింపు (టీడీఎస్‌)ను విధించనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్‌ 1 నుంచి అమలవుతుందని తెలిపింది. ఒక వ్యక్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 31 లోగా రూ.కోటి, అంతకుమించి నగదు ఉపసంహరించి ఉంటే, తర్వాతి అన్ని నగదు ఉపసంహరణలపైనా రెండు శాతం టీడీఎస్‌ వర్తిస్తుందని వివరించింది.

6. ఉపాధి అవకాశాలు దివ్యాంగుల హక్కు: సుప్రీంకోర్టు

దివ్యాంగులకు ఉపాధి అవకాశాలను హక్కులాగా కల్పించాలని, సానుభూతి ప్రాతిపదికన కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. సివిల్‌ జడ్జి నియామకం విషయంలో నీతూహర్ష్‌ అనే దృష్టిలోపం ఉన్న వ్యక్తి దాఖలు చేసుకున్న కేసులో ఈవిషయాన్ని స్పష్టం చేసింది.

7. ఆంగ్ల పదాల ఉచ్చారణకు ఇఫ్లూ యాప్‌

ఆంగ్ల పదాల ఉచ్చారణపై ఉచితంగా పాఠాలు చెప్పేందుకు  హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌, ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) ‘ఇంగ్లిష్‌ ప్రొ’ పేరిట మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఇందులో 4 మాడ్యూళ్లు, 20 పాఠాలు ఉన్నాయి. పదంపై క్లిక్‌ చేయగానే ఉచ్చారణ స్పష్టంగా వినిపించేలా తయారు చేశారు. ఈ యాప్‌ను వారం, పది రోజుల్లో ప్రారంభించనున్నారు.

8. ఈపీఎఫ్‌పై వడ్డీ8.65%

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)పై 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువరించనుంది. ప్రస్తుతం డిపాజిట్లపై 8.55 శాతం వడ్డీ చెల్లిస్తుండగా, దాన్ని 8.65 శాతానికి పెంచాలని గతంలో ప్రతిపాదించింది. ఇందుకు ఆర్థిక శాఖ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నామని కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ శుక్రవారం చెప్పారు. 

9. తీరంలో ఘోరమే!

మానవ పరిణామక్రమానికి ఊపిరిలూదిన సాగరాలు ఇక పెను విధ్వంసాన్ని సృష్టించబోతున్నాయని ఐరాస ముసాయిదా నివేదిక హెచ్చరించింది. సముద్ర మట్టాలు పెరిగిపోయి, తీర ప్రాంతం వెంబడి ఉన్న అనేక మహానగరాల్లో జలప్రళయం తప్పదని, కోట్ల మంది నిరాశ్రయులవుతారని పేర్కొంది. కరుగుతున్న మంచుతో మరిన్ని విపత్తులు పొంచి ఉన్నాయంది. ప్రధానంగా చైనా, అమెరికా, ఐరోపా, భారత్‌లకు ఈ ముప్పు తీవ్రంగా ఉన్నట్లు స్పష్టంచేసింది.

10. అంతరిక్ష యుద్ధాలకు అమెరికా సై

అంతరిక్ష యుద్ధాలకు అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా తన సైన్యంలో రోదసి విభాగాన్ని (స్పేస్‌ కమాండ్‌) ఏర్పాటు చేసింది. శ్వేతసౌధంలో ఓ కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. రష్యా, చైనా వంటి దేశాలు అంతరిక్ష రంగంలో దూసుకెళుతున్నాయి. ఈ దేశాల నుంచి తన ఉపగ్రహాలకు ముప్పు ఎదురవుతుందని అమెరికా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యలు చేశారు...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..