టాప్ టెన్ న్యూస్...

1. పాలన కొత్త పుంతలు 

గాంధీ జయంతి నుంచి రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తేవాలని యోచిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. కొత్త చట్టం విప్లవాత్మకమైందని, వ్యవస్థలోని లొసుగులన్నింటినీ తొలగించి, ప్రజలందరికీ కష్టాలు తీర్చేలా కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. సెప్టెంబరులో జరిగే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో దానిని ఆమోదిస్తామని చెప్పారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాలు, సంస్కరణల ద్వారా తెలంగాణ పాలన కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారు. చట్టాలను నూటికి నూరుశాతం అమలు చేస్తామన్నారు.

2. బందరుపోర్టుపై త్వరలో నిర్ణయం

బందరు పోర్టు నిర్మాణంపై త్వరలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని  మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పేర్కొన్నారు. ‘ఈ పోర్టు నిర్మాణంపై కేంద్రం, రాష్ట్రం పలు సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నాయి. కన్సార్టియంగా ఏర్పడి నిర్మాణం చేయడంపైనా ఆలోచనఉంది. కేంద్రం సాయం తీసుకోవాలా? రాష్ట్రమే చేపట్టాలా? అనేది ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారు’ అని పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’లో మంత్రి నాని రాష్ట్ర ప్రభుత్వం బందరుపోర్టును తెలంగాణకు ఇచ్చేసిందంటూ వస్తున్న ప్రచారంపై మండిపడ్డారు.

3. భాజపాలోకి దేవేందర్‌గౌడ్‌?

ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు భాజపా సంప్రదింపులు ముమ్మరం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో దేవేందర్‌గౌడ్‌ ఇంటికెళ్లి సమావేశమయ్యారు. దేవేందర్‌తోపాటు ఆయన కుమారుడు వీరేందర్‌గౌడ్‌ను పార్టీలోకి లక్ష్మణ్‌ ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వీరేందర్‌గౌడ్‌ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్‌ నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేసిన విషయం తెలిసిందే. వారు పార్టీలో చేరడం దాదాపు ఖాయమేనని.. మూడు, నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుందని భాజపా నేత ఒకరు పేర్కొన్నారు.

4. చిదంబరం మెడపై అరెస్టు కత్తి!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరానికి మంగళవారం న్యాయస్థానాల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీనిపై ఆయన వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడా ఉపశమనం లభించలేదు. ఆయన పిటిషన్‌పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం సుముఖత చూపలేదు. బుధవారం ఉదయం దీన్ని దాఖలు చేయాలని సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో చిదంబరానికి అరెస్టు ముప్పు పొంచి ఉంది.

5. గుదిబండ పథకాలకు స్వస్తి

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గే అవకాశముంది. ఈ దిశగా 15వ ఆర్థిక సంఘం పలు ప్రతిపాదనలు చేయాలని భావిస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలను తగ్గించి ఆ మేరకు మిగిలే నిధులను కేంద్రం ఆధ్వర్యంలోని రంగాలకు మళ్లించాలన్న రాష్ట్రాల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తోంది. ఇది అమల్లోకి వస్తే.. ఆయా పథకాలకు తమ వాటా నిధులను సమకూర్చాల్సిన భారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. రాష్ట్ర జాబితా కిందకు వ్యవసాయం, నీటిపారుదల, ప్రజారోగ్యం, మత్స్యపరిశ్రమ, సామాజిక న్యాయం వంటి రంగాలు వస్తాయి.

6. ఉద్దేశపూర్వకంగానే భారత సంతతిపై దాడి

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా లండన్‌లో భారతీయ హైకమిషన్‌ కార్యాలయం వద్ద భారతీయ సంతతి ప్రజలపై జరిగిన దాడిని ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో ప్రస్తావించారు. జాన్సన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడుతూ  ‘కేవలం ఒక అజెండాతో, స్వప్రయోజనాలకు పెద్ద మూక బరితెగించి హింసాత్మకదాడికి దిగింది’ అని  వ్యాఖ్యానించారు. ‘తీవ్రవాదం భారత్‌, యూరప్‌ సహా ప్రపంచమంతా వ్యాపించింది. ఐసిస్‌ అడుగుజాడల్లో ప్రపంచమంతా తీవ్రవాద సంస్థలు విస్తరిస్తున్నాయి.ఈ నేపథ్యంలో హింస, అసహనం పెచ్చుమీరాయి’ అని ప్రధాని మోదీ జాన్సన్‌తో అన్నారు.

7. చౌక వడ్డీ రేటుకే ఎస్‌బీఐ వాహన, గృహ రుణాలు

పండుగ సీజన్‌లో వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు తక్కువ వడ్డీకే ఇవ్వనున్నట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)  ప్రకటించింది. ఈ ఆఫర్లు ఎప్పటి నుంచి ఎప్పటివరకు వర్తిస్తాయో వెల్లడించలేదు.  కారు రుణాలకు ప్రాసెసింగ్‌ రుసుము ఉండదు. వడ్డీ రేటు అత్యంత తక్కువగా 8.7% నుంచి ప్రారంభమవుతుంది. భవిష్యత్‌లో వడ్డీ రేట్లు పెరిగినా ఆ భారం వినియోగదారులపై వేయబోమని తెలిపింది. ఆన్‌లైన్‌ ద్వారా అంటే ఎస్‌బీఐ డిజిటల్‌ ప్లాట్‌ఫాం యోనో లేదా ఎస్‌బీఐ పోర్టల్‌ ద్వారా కారు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే వడ్డీ రేటులో 25 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు పొందొచ్చు.

8. శ్రీశాంత్‌పై నిషేధం ఇంకో ఏడాదే

స్పాట్‌ఫిక్సింగ్‌ కుంభకోణానికి సంబంధించి జీవితకాల నిషేధానికి గురైన కళంకిత ఫాస్ట్‌బౌలర్‌ శ్రీశాంత్‌కు ఊరట. వచ్చే సెప్టెంబరు నుంచి అతడు మళ్లీ క్రికెట్‌ ఆడొచ్చు. శ్రీశాంత్‌ నిషేధాన్ని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఏడేళ్లకు తగ్గించారు. ఆరేళ్ల శిక్ష అనుభవించిన అతడు ఇప్పటికే తన ఉచ్ఛ స్థితిని దాటేశాడని అన్నారు. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతూ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డందుకు శ్రీశాంత్‌తో పాటు అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌లపై  బీసీసీఐ 2013లో జీవితకాల నిషేధం విధించింది. ఐపీఎల్‌లో ఒక ఓవర్లో ఉద్దేశపూర్వకంగా 14 పరుగుల ఇచ్చినందుకు రూ.10 లక్షలు అందుకున్నాడన్నది శ్రీశాంత్‌పై ఆరోపణ.

9. భాగ్యనగరంలో త్రివాణీ సంగమం

దిగ్గజ గాయకులు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాస్‌, చిత్ర ఒకే వేదికపైకి రానున్నారు. తెలుగు చిత్రాల్లో తాము పాడిన అపురూపమైన గీతాల్ని ఆలపించబోతున్నారు. ‘లెజెండ్స్‌’ పేరుతో నవంబరు 30న హైదరాబాద్‌లో ఓ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ‘‘తెలుగులో ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం మొదటిసారి. అంతర్జాతీయ స్థాయిలో ఈ షో జరగబోతోంది. నేనూ, అన్నయ్య ఏసుదాస్‌, చిత్ర.. మా సినీ జీవితంలో లక్ష పాటలు పాడి ఉంటాం. అందులో ముప్ఫై పాటల్ని ఎంపిక చేసుకుని, వేదికపై ఆలపించడం చాలా కష్ట తరమైన విషయం’’ అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు.

10. 59 నిమిషాల్లో గృహ, వాహన రుణం!

రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీ) సిద్ధమవుతున్నాయి. ‘పీఎస్‌బీలోన్స్‌ఇన్‌59మినిట్స్‌’ పోర్టల్‌లో గృహ, వాహన.. ఇతర రిటైల్‌ రుణాలు కూడా భాగం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోర్టల్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య శ్రేణి సంస్థల (ఎంఎస్‌ఎంఈలు)కు రూ.కోటి వరకు రుణాలను 59 నిమిషాలు లేదా గంట కంటే తక్కువ సమయంలోనే సూత్రప్రాయ ఆమోదం ఇస్తున్నారు. ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ సహా మరికొన్ని పీఎస్‌బీలు ఈ మొత్తాన్ని రూ.5 కోట్ల వరకు పెంచాలని నిర్ణయించాయి...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..