అసోంలో జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా విడుదలైంది

దిల్లీ:

అసోంలో జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా విడుదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాబితాలో లేనివారి పేర్లను మాత్రమే ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. దాదాపు 19.06 లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా తేల్చారు. 3.11కోట్ల మందికి తుది జాబితాలో చోటు దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో భారీగా భద్రతా బలగాలను మొహరించింది. గువాహటిలోని సచివాలయం, అసెంబ్లీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 144సెక్షన్‌ విధించారు. సున్నితమైన కశ్మీర్‌ అంశం ఇంకా చల్లారకముందే మరో కీలక అంశం ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదల కావడం గమనార్హం.
జాబితాలో లేనివారికి కేంద్రం భరోసా...
శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్రబలగాలను రాష్ట్రంలో భారీగా మోహరించారు. మరోవైపు జాబితాలో లేనివారి కోసం కేంద్రం ఉపశమన చర్యలు చేపట్టింది. జాబితాలో లేకపోయినా ఎవరినీ వెంటనే విదేశీయులుగా పరిగణించబోమని ప్రకటించింది. విదేశీయుల గుర్తింపుపై ట్రైబ్యునల్‌లో తీర్పు వచ్చేవరకు ఎటువంటి చర్యలు ఉండవని స్పష్టీకరించింది. ఎవరినీ నిర్బంధించబోమంటూ హామీ ఇచ్చింది. ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు, ఇతర సౌకర్యాలనుంచి ఎవరికీ మినహాయింపు ఉండదని, వారి పిల్లలకు విద్య, పౌరసత్వం తదితర అంశాల్లో ఎటువంటి ఆటంకాలూ ఉండవని ప్రకటించింది.
జాబితాలో లేనివారు ట్రైబ్యునల్‌లో, తరవాతి దశలో హైకోర్టులో అప్పీలు చేసుకుని న్యాయం పొందడానికి అవసరమయ్యే మొత్తం వ్యయాన్ని తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 200 ట్రైబ్యునళ్లను నియమించింది. మరో 200 ట్రైబ్యునళ్లను నియమించడానికి సిద్ధపడుతోంది. ట్రైబ్యునల్‌లో అప్పీలు సమయాన్ని 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచడంతోపాటు జిల్లా న్యాయ సహాయ సంఘాలను సంఘటితపరచింది. ప్రభుత్వం ఇన్ని ఉపశమన చర్యలు ప్రకటించినా ఉద్రిక్తతల విషయంలో ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. 

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..