ఐఎన్‌ఎక్స్‌ మీడియాతోపాటు మరి కొన్ని కేసుల్లో చిదంబరం చుట్టూ ఉచ్చు

యూపీఏ ప్రభుత్వంలో హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం తన కొడుకు కార్తీ కంపెనీలకు భారీగా లబ్ధి చేకూర్చారని ఆరోపణలున్నాయి. ఐఎన్‌ఎక్స్‌ మీడియాతోపాటు మరి కొన్ని కేసుల్లో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయన్ను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనపై ఉన్న కేసుల వివరాలివీ...

ఐఎన్‌ఎక్స్‌: విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా!
స్టార్‌ టీవీ ఇండియాకు సీఈఓగా దాదాపు పదేళ్ల పాటు పనిచేసి ఆ తరువాత బయటకు వచ్చేసిన పీటర్‌ ముఖర్జియా సంస్థ పేరే ఐఎన్‌ఎక్స్‌ మీడియా. ఈయన తన భార్య ఇంద్రాణి ముఖర్జీతో కలిసి 2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియాను ఆరంభించారు. దాన్లో ఇంద్రాణి సీఈఓగా ఉండగా... పీటర్‌ ముఖర్జియా చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా చేరారు. ఈ సంస్థలోకి విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిన రూ.305 కోట్లకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ) పచ్చజెండా ఊపింది.

ఈ ఎఫ్‌ఐపీబీ అనుమతుల విషయంలో అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న పి.చిదంబరం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధాన అభియోగం. అంతేకాక విదేశీ పెట్టుబడుల రూపంలో ఐఎన్‌ఎక్స్‌లోకి వచ్చిన డబ్బులు వేరెవరివో కావని, చిదంబరం తనయుడు కార్తీకి చెందిన వివిధ కంపెనీలు ఈ పెట్టుబడుల్ని ఇండియాకు తరలించడానికి ఐఎన్‌ఎక్స్‌ మార్గాన్ని ఎంచుకున్నాయని, ఇది స్పష్టమైన మనీ లాండరింగ్‌ వ్యవహారమని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. పీటర్‌ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీలు ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్లుగా మారిపోయారు. ఈ కేసులో తమను ఇరికించకుండా చూడడానికి వారు కార్తీకి 10 లక్షలు లంచం కూడా ఇచ్చారని సీబీఐ చెబుతోంది.  
 
ఎయిర్‌సెల్‌– మాక్సిస్‌: అక్రమ అనుమతులు!
ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసు 2011వ సంవత్సరం మేలో వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌సెల్‌ సంస్థ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్‌ తన సంస్థలోని 74 శాతం వాటాలను 2006లో మలేసియా కంపెనీ మాక్సిస్‌కు విక్రయించారు. అప్పటి కేంద్ర టెలికం మంత్రి దయానిధి మారన్‌ బలవంతంగా తనతో ఈ పని చేయించారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు ఆరంభించగా... ఈడీ కూడా మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. రూ.3,500 కోట్ల విలువ చేసే పెట్టుబడులను మాక్సిస్‌ సంస్థ ఎయిర్‌సెల్‌లో పెట్టిన సమయంలో ఆర్థిక మంత్రిగా చిదంబరమే ఉన్నారు.

వాస్తవానికి ఈ స్థాయి విదేశీ పెట్టుబడులకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం నిబంధనల్ని తోసిరాజని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ) ద్వారా అనుమతులు మంజూరు చేశారని అభియోగాలున్నాయి. నిజానికి ఎఫ్‌ఐపీబీకి రూ.600 కోట్ల వరకు విలువున్న పెట్టుబడులకు మాత్రమే అనుమతినిచ్చే అధికారం ఉంది. ఈ ఒప్పందం కుదరడానికి చిదంబరం కుమారుడు కార్తీకి భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి.  

20 సార్లు చిదంబరానికి ఊరట
ఐఎన్‌ఎక్స్, ఎయిర్‌సెల్, మాక్సిస్‌ కేసుల్లో ఇప్పటికే పలు దఫాలు దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ చిదంబరాన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించాయి. చిదంబరం ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు దాఖలు చేసుకొని అరెస్ట్‌ నుంచి తప్పించుకున్నారు. ఈ ముందస్తు బెయిల్‌కు సంబంధించిన గడువుల్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. అలా మొత్తంగా 20 సార్లు చిదంబరానికి ఊరట లభించింది. ఇప్పటికే ఈడీ చిదంబరాన్ని గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో రెండు సార్లు ప్రశ్నించింది కూడా.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..