ముంబై 26/11 పేలుళ్ల సూత్రధారి అరెస్ట్..

ముంబై 26/11 పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజ్రాన్‌వాలా వెళ్తున్న హఫీజ్‌ను లాహోర్‌లో అరెస్ట్ చేసిన పంజాబ్(పాకిస్తాన్) పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.ఈ సందర్భంగా హఫీజ్ మాట్లాడుతూ..తనపై కేసులను కోర్టులో సవాల్ చేయబోతున్నట్టు తెలిపాడు. అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా వెళ్లబోతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.పాకిస్తాన్ తమ ఎయిర్‌స్పేస్‌ను ఓపెన్ చేసిన మరుసటిరోజే ఈ అరెస్ట్ జరిగింది.

ఉగ్రవాదం,ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలన్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) ఒత్తిడితో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సతమతమవుతోంది.ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలను గ్రే లిస్టులో(ఉగ్రవాదానికి సహకరించే దేశాల జాబితా) పెట్టాలన్న నిబంధన పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఈ నేపథ్యంలోనే హఫీజ్ సయీద్‌ అరెస్ట్ జరిగింది. హఫీజ్ సయీద్‌ మొత్తం 23 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇందులో ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరించారన్న కేసులు కూడా ఉన్నాయి.అయితే కోర్టు ముందు పాక్ ప్రభుత్వం సరైన సాక్ష్యాధారాలేవి సమర్పించకపోవడంతో బెయిల్‌పై విడుదలయ్యాడు.

పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌ హఫీజ్ సయీద్‌‌ గురించి మాట్లాడుతూ.. మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి ఉగ్రవాద కార్యకలాపాల కోసం అతను నిధులు సేకరించినట్టు వెల్లడించింది.2008లో ముంబైపై దాడులకు దిగిన లష్కరే-తోయిబాకు వీరు నిధులు సమకూర్చారని తెలిపింది. అప్పటి ఘటనలో దాదాపు 165 మంది చనిపోయారు.కాగా, హఫీజ్ సయీద్‌‌ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్ సయీద్‌‌‌ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు సమర్పిస్తే 10మిలియన్ డాలర్ల రివార్డు అందిస్తామని గతంలో అమెరికా ప్రకటించింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..