జియో ఇప్పుడు కొత్తగా మరో ప్రయోగానికి తెరతీస్తోంది

అపరమిత ఆఫర్లతో మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ రంగంలో సంచలనం సృష్టించిన జియో ఇప్పుడు కొత్తగా మరో ప్రయోగానికి తెరతీస్తోంది. జియో గిగా ఫైబర్‌ పేరుతో ఉచిత ఇంటర్నెట్‌ కనెక్షన్‌లతో ఇంటర్నెట్‌ వినియోగం రూపురేఖలను మార్చివేసేందుకు రంగం సిద్ధం చేసింది. జియో ఉచిత హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో పాటు ఉచిత ల్యాండ్‌లైన్‌ అందిస్తుంది. అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ను దేశమంతా అందించే ఈ ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌తో ఇప్పుడు వినియోగదారులు పడుతున్న సిగ్నల్‌ ఇబ్బందులకు చెక్‌ చెప్పవచ్చు. ఇప్పటికే నగరాలలో విస్తృతంగా కనెక్షన్‌లు ఇచ్చిన జియో గిగా ఫైబర్‌ సేవలు మధ్యతరహా పట్టణాలకూ అందించనుంది.

వివిధ సెల్‌ నెట్‌వర్కులు ప్రస్తుత పరిస్థితులలో నాణ్యమైన సేవలందించలేక ఇబ్బందులు పడుతుంటే మరికొన్ని సెల్‌ నెట్‌వర్క్‌లు రెండు, మూడు కలసి ఒకటిగా విలీనం అయ్యాయి. మొబైల్‌ నెట్‌వర్క్‌లలో ఏర్పడిన పోటీ వాతావరణంలో జియో రంగప్రవేశంతో గ్రామీణ ప్రాంతాలకూ మారుమూల పల్లెలకూ విస్తరించిన సెల్‌సేవలు అన్నివర్గాల ప్రజల చేతిల్లోకి వెళ్ళాయి. అవసరం అయితే ఒకపూట అల్పాహారం, టీ వంటివి మానివేసి అయినా ఆ సొమ్ములతో సెల్‌ను వినియోగించుకునే స్థాయికి పౌరులు వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో మరింత ఉచిత ఆఫర్లతో నాణ్యమైన సేవలతో జియో నెట్‌వర్క్‌ విస్తరించడానికి ఆ సంస్థ రంగం సిద్దం చేయడంతో వివిధ సెల్‌ నెట్‌వర్క్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం కనిపిస్తున్నది.

నెలకు 1100 జీబీ డేటా ఉచితం

ఉచిత ప్రివ్యూ ఆఫర్‌ పేరిట ఇస్తున్న ఈ కనెక్షన్లు దాదాపు సంవత్సరం పాటు ఉచితంగా లభిస్తాయని చెబుతున్నారు. వాణిజ్య పరంగా సేవలు ప్రారంభించడం ఆలస్యమైన పక్షంలో ఇంకా ఎక్కువ కాలమే ఉచితం కొనసాగవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జియో గిగాఫైబర్‌ సేవలను రిఫండబుల్‌ డిపాజిట్‌తో వినియోగించుకోవచ్చు. 50 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ చాలనుకుంటే రూ.2500, 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ కావాలంటే రూ.4500 డిపాజిట్‌గా చెల్లించాలి. వినియోగదారుడు సర్వీస్‌ అవసరం లేదనుకుంటే తాను చెల్లించిన డిపాజిట్టు ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చు. ఈ రెండు పథకాలలోనూ నెలకు 1100 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఉచిత ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో పాటు ఈ పథకంలో ఉచిత ల్యాండ్‌లైన్‌ ఇస్తున్నారు. ఈ ల్యాండ్‌లైన్‌ నుంచి దేశమంతా అపరిమిత ఉచిత కాల్స్‌ పొందవచ్చు.ల్యాండ్‌లైన్‌గానే కాకుండా జియో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్‌ నుంచి సైతం ల్యాండ్‌లైన్‌ నెంబర్‌తో కాల్స్‌ చేసుకోవచ్చు.. అందుకోవచ్చు. జియో కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇదే కనెక్షన్‌పై కేబుల్‌ టీవీ ప్రసారాలను అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.

 

కేబుల్‌, నెట్‌ ప్రొవైడర్లకు ఇబ్బందులే..?

జియో ఉచిత ఆఫర్లతో ప్రస్తుత ఇంటర్నెట్‌ ప్రొవైడర్లు పూర్తిగా తమ వ్యాపారాలను వదలివేసే పరిస్థితి రావచ్చని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. జియో సంస్థ తన ఫైబర్‌లైన్లను వేయని ప్రదేశాలలో మినహా జియో ప్రవేశించిన ప్రాంతాలలో ఇతర ప్రొవైడర్ల బిజినెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముందని అభిప్రాయపడుతున్నారు. జియో సంస్థ కేబుల్‌ టీవీ ప్రసారాలను ప్రారంభిస్తే సంప్రదాయక కేబుల్‌ ఆపరేటర్లు, డిష్‌ టీవీ సర్వీసులు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. జియో తమ వినియోగదార్లకు కనెక్షన్లు ఇవ్వడానికి పూర్తిస్థాయి సాంకేతికను ఉపయోగించుకుంటుంది. దరఖాస్తు ఫారాలు, వెరిఫికేషన్లు లేకుండా కేవలం నిమిషాల వ్యవధిలో కనెక్షన్‌ ఇచ్చే ఏర్పాట్లను జియో కంపెనీ చేస్తుంది. రానున్న రోజులలో మొబైల్‌ వినియోగదార్లు, ఇంటర్నెట్‌ వినియోగదార్లు, కేబుల్‌ వినియోగదారులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందుకోవడానికి జియో ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇప్పటికే నగరాలలో సేవలందిస్తూ పట్టణాలు, మధ్యతరహా పట్టణాలు, గ్రామాలకూ తమ గిగా ఫైబర్‌ సేవలను అందించడానికి వేగంగా ముందుకు వస్తోంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..