ముంబయి నుంచి దిల్లీకి వెళ్లాల్సిన ‘విస్తారా ఎయిర్‌లైన్స్‌’కు చెందిన విమానానికి సోమవారం పెను ప్రమాదం తప్పింది.

దిల్లీ:

ముంబయి నుంచి దిల్లీకి వెళ్లాల్సిన ‘విస్తారా ఎయిర్‌లైన్స్‌’కు చెందిన విమానానికి సోమవారం పెను ప్రమాదం తప్పింది. 153 మంది ప్రయాణికులతో సోమవారం మధ్యాహ్నం 3.30గంటలకు ముంబయి నుంచి బయలుదేరి సాయంత్రం 5గంటలకు దిల్లీకి చేరింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో దిల్లీ విమానాశ్రయంలో దిగేందుకు అనుమతి లభించలేదు. దీంతో సమీపాన ఉన్న లఖ్‌నవూకు వెళ్లాలని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది సూచించారు. పైలట్‌ అందుకనుగుణంగానే అక్కడికి చేరకున్నారు. కానీ, అక్కడా వాతావరణ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో వారు మళ్లీ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాలని కోరారు. ప్రయాగ్‌రాజ్‌కి సమీపాన ఉన్న తరుణంలో పరిస్థితులు చక్కబడ్డాయని.. తిరిగి లఖ్‌నవూకి రావాలని పైలట్‌కు మరో సందేశం అందింది. లఖ్‌నవూలో ప్రయాణికులకు మెరుగైన వసతులు ఉండడంతో తిరిగి అక్కడికే వెళ్లాలని పైలట్‌ నిర్ణయించుకున్నారు.  ఈ క్రమంలో విమానంలో ఉన్న అదనపు ఇంధనం అయిపోవస్తోంది. మరో పది నిమిషాలైతే ఇంధనం పూర్తిగా అయిపోతుందన్న సమయంలో పైలట్‌ లఖ్‌నవూ విమానాశ్రయానికి అత్యవసర సిగ్నల్‌ అయిన ‘మే డే’ కాల్‌ పంపించారు. దీంతో అప్రమత్తమైన అక్కడి సిబ్బంది వెంటనే విమానం ల్యాండింగ్‌కు అన్ని అనుమతులిచ్చారు. విమానం సురక్షితంగా దిగింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో పది నిమిషాలు విమానం గాల్లోనే ఉండి ఉంటే దాదాపు 153 మంది ప్రాణాలకు అపాయం పొంచి ఉండేదే.
ఇటీవల పలు రాష్ట్రాల్లో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకోవడంతో విమానాలు ఎంత ఇంధనం మోసుకెళ్లాలన్న దానిపై  డీజీసీఏ జులై 5న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గమ్యంతో పాటు సమీపాన గల మరో రెండు విమానాశ్రయాలకు చేరుకునేలా ఇంధనం ఉంచుకోవాలని ఆదేశించింది. అలాగే ల్యాండింగ్‌ విషయంలో తక్కువ ఇంధనం ఉన్న విమానాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని విమానాశ్రయాలకు సూచించింది. 

విమానం ఎంత ఇంధనం మోసుకెళ్లాలి?

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఎగరడానికి ముందు ఒక విమానంలో కింద పేర్కొన్న స్థాయిలో ఇంధనం ఉండాలి.
ట్యాక్సీ ఫ్యుయల్‌: టేకాఫ్‌కి ముందు నేలపై విమానం వినియోగించుకునే ఇంధనమే ట్యాక్సీ ఫ్యుయల్‌. సాధారణంగా విమానం పాత గణాంకాల ఆధారంగా దీన్ని లెక్కగడతారు. 
ట్రిప్‌ ఫ్యుయల్‌: ఇది లక్షిత విమానాశ్రయానికి చేరుకోవడానికి కావాల్సిన ఇంధనం. 

కంటింజెన్సీ ఫ్యుయల్‌: ప్రతికూల పరిస్థితుల్లో ల్యాండింగ్‌కి అనుమతి లభించని సమయంలో వినియోగించేందుకు వీలుగా కంటింజెన్సీ ఇంధనాన్ని మోసుకెళ్లాలి. ఇది సాధారణంగా ట్రిప్‌ ఫ్యుయల్‌లో ఐదు శాతం ఉంటుంది. లేదా డెస్టినేషన్‌ విమానాశ్రయం వద్ద 450 మీటర్ల ఎత్తులో ఐదు నిమిషాల పాటు ఎగిరేందుకు సరిపడా కావాల్సిన ఇంధనమే కంటింజెన్సీ ఇంధనం. 

డైవర్షన్‌ ఫ్యుయల్‌: ప్రతికూల పరిస్థితుల్లో మరో సమీప విమానాశ్రయానికి చేరుకోవడానికి కావాల్సిన ఇంధనం. సమీప విమానాశ్రయాన్ని పరిగణనలోకి తీసుకోని క్రమంలో 450 మీటర్ల ఎత్తులో 15 నిమిషాలు పాటు ఎగరడానికి కావాల్సిన ఇంధనంగా లెక్కగడతారు.

అడిషనల్‌ ఫ్యుయల్‌: ఇంజిన్‌ ఫెయిల్‌ అయిన క్రమంలో అదనపు థ్రస్ట్‌ కోసం లేదా.. పీడనం పడిపోయిన సమయంలో వినియోగించుకోవడానికి కావాల్సిన ఇంధనం. ఇది సమీప విమానాశ్రయానికి చేరుకునేందుకు సరిపడా ఉండాలి. దీన్ని అత్యంత ప్రతికూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని లెక్కగడతారు. 

రిజర్వ్‌ ఫ్యుయల్‌: ల్యాండింగ్‌ అనుమతి లభించక ప్రత్యామ్నాయ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అక్కడ అనుమతులు లభించే వరకు గాలిలో చక్కర్లు కొట్టేందుకు కావాల్సిన ఇంధనం. ఇది 450 మీటర్ల ఎత్తులో 30 నిమిషాల పాటు ఎగరడానికి కావాల్సిన ఇంధనం

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది