టాప్ 10 న్యూస్ - 3pm
1. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి పాలకొల్లు వెళ్తున్న కారు రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 11 మందిలో ఇద్దరు చిన్నారులుసహా ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
2. సిద్దిపేట జిల్లా మాజీ సర్పంచితో సీఎం కేసీఆర్ ఫోన్ సంభాషణ
ముఖ్యమంత్రులు సాధారణ వ్యక్తులకు ఫోన్ చేసి మాట్లాడటం చాలా అరుదు. గతంలో ఆదిలాబాద్ జిల్లా రైతు శరత్‌కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్.. రహదారి విషయమై తాజాగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ మాజీ సర్పంచికి ఫోన్ చేసి మాట్లాడారు. జగదేవపూర్, మర్కూక్ మండలాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ వెళ్లేందుకు దగ్గర దారి నిర్మించాలని సీఎం భావించారు. రాజీవ్ రహదారిలో ఉన్న ఒంటిమామిడి నుంచి మర్కూక్ మండలం పాండురంగ ఆశ్రమం వరకు రెండు వరసల రహదారి వేయించాలని అనుకున్నారు. ఈ దారి నిర్మాణానికి అవసరమైన భూమిని ఆయా గ్రామాల రైతులు ఇస్తరా? లేదా? అనే విషయమై సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ మాజీ సర్పంచి వెంకటేశ్ గౌడ్‌తో సీఎం సెల్ఫోన్లో సంభాషించారు.
3. కక్ష సాధింపు కానేకాదు: జగన్
ఎవరిపైనో కక్ష తీర్చుకోవడానికో, ద్వేషంతోనో గత ప్రభుత్వ అవినీతి, అవకతవకలపై విచారణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించలేదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా గత ప్రభుత్వ నిర్ణయాలవల్ల జరిగిన అవినీతిని నిరోధించి ప్రజాధనాన్ని కాపాడేందుకే ఈ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు. దీంతో వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన అవినీతిని పోగొట్టి, వ్యవస్థ మొత్తాన్ని సరిదిద్దాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
4. సోమవారం ప్రజా వినతుల దినం
ప్రతి సోమవారం ప్రజా వినతుల దినం నిర్వహించాలని ఎస్పీలు, కమిషనర్లను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. ఉదయం 10.30గంటల నుంచి 12.30గంటల వరకు దీనిని నిర్వహించాలన్నారు. సామాన్య పౌరులకు చేరువయ్యేందుకు, ప్రజలకు ఉత్తమ పోలీసింగ్ సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వినతులను కంప్యూటర్లో రికార్డు చేయాలని, నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలని కోరారు.
5. ఇడ్లీ పిండి కొంటే.. బకెట్ నీరు ఉచితం!
ఇడ్లీ పిండి కొంటే ఒక బకెట్ నీరు ఉచితంగా ఇస్తామని తమిళనాడులోని చెన్నై నగరంలో ఓ దుకాణ యజమాని ప్రకటించారు. ప్రస్తుతం నగరంలోని నీటి ఎద్దడి తీవ్రతకు ఈ ప్రకటన అద్దంపడుతోంది. ట్రిప్లికేన్ రాఘవేంద్ర ఆలయానికి సమీపంలోని ఎల్లయమ్మన్ దుకాణంవద్ద ఈ మేరకు సూచిక ఏర్పాటు చేశారు. వ్యాపారాభివృద్ధికి, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తన వంతు సాయం అందించేందుకు ఈ సలహా బాగుండటంతో ఇలా నీరు అందిస్తున్నామని యజమాని చెప్పారు.
6. వర్షపాతం లోటు 33శాతం
దేశవ్యాప్తంగా జూన్ 30 నాటికి రుతుపవన వర్షపాతం లోటు 33 శాతమని, అదే సమయంలో 30 వాతావరణ ఉప విభాగాల్లో అత్యంత లోటు వర్షపాతం, ఐదింట్లో సాధారణ వర్షపాతం, అండమాన్, నికోబార్ దీవుల్లో మాత్రం అదనపు వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ విభాగం ఆదివారం తెలిపింది. వచ్చేవారం (సోమవారం నుంచి) రుతుపవనాలు మరింత చురుగ్గా ఉండనున్నాయని పేర్కొంది.
7. జీఎస్టీలో మరిన్ని సంస్కరణలు
జీఎస్టీ అమల్లోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నేడు మరిన్ని సంస్కరణలను ప్రభుత్వం ప్రకటించనుంది. కొత్త రిటర్న్‌ల ప్రక్రియ అమలు, నగదు లెడ్జర్ విధానం సరళీకరణ, ఏక రిఫండ్ పంపిణీ వ్యవస్థ లాంటివి ఇందులో కొన్ని. కొత్త రిటర్న్‌ల విధానం నేటి నుంచి ప్రయోగత్మాక పద్ధతిలో ప్రారంభం అవుతుందని, అక్టోబరు నుంచి 1 నుంచి దీనిని తప్పనిసరి చేస్తామని తెలిపింది.
8. భారత్‌కు ఓటమి రుచి చూపిన ఇంగ్లాండ్
ప్రపంచకప్‌లో కోహ్లీసేనకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం భారత్ 31 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. మొదట ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జానీ బెయిర్‌స్టో (111), బెన్ స్టోక్స్ (79), జేసన్ రాయ్ (66) మెరుపులతో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం టీమ్ఇండియా 5 వికెట్లకు 306 పరుగులే చేయగలిగింది. రోహిత్ శర్మ (102) సెంచరీ వృథా అయింది. కోహ్లి (66), పాండ్య (45)ల పోరాటం సరిపోలేదు.
9. విమానం కూలి 10 మంది మృతి.
టెక్సాస్‌లో ఓ చిన్న ప్రైవేటు విమానం ప్రమాదానికి గురై పది మంది మృతిచెందారు. స్థానిక యాడిసన్ మున్సిపల్ విమానాశ్రయంలో ఆదివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. రెండు ఇంజిన్లు కలిగి ఉన్న బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఏయిర్ 350 రకానికి చెందిన విమానం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే విమానాశ్రయ హ్యంగర్ (విమానాలను నిలిపి ఉంచే షెడ్డు)ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
10. బడిలో బాలికపై అత్యాచారం.
ఆడపిల్ల బాగా చదువుకోవడం కూడా పాపమేనా?
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ బాలిక పాలిట అదే శాపంలా మారింది. ఉమ్మడి కుటుంబంలో ఉంటూ.. తమకంటే చదువుల్లో రాణిస్తోందన్న అసూయతో నలుగురు బాలురు ఆమెకు మత్తుమందు ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అకృత్యంలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ పాలుపంచుకోవడం సభ్య సమాజానికే మాయనిమచ్చ. సాక్షాత్తూ బడి ఆవరణలోనే లైంగిక దాడికి పాల్పడిన వారంతా.. ఈ దారుణాన్ని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచి మరింత నీచానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయగా మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు...
Comments
Post a Comment