ఈ ప్లాన్‌తో లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 తగ్గింపు... సాధ్యమేనా?

లీటర్ పెట్రోల్ ధర ఒకేసారి రూ.10 తగ్గితే ఎలా ఉంటుంది? వాహనదారులకు అంతకుమించిన పండగ లేనట్టే. సాధారణంగా పెట్రోల్ ధరలు లీటర్‌పై పైసల్లో తగ్గుతుంది. లేదా ఒకట్రెండు రూపాయలు మాత్రమే తగ్గుతుంది. కానీ ఒకేసారి రూ.10 తగ్గడమంటే... వాహనదారుల జేబులకు చాలా మేలు చేసినట్టే. ఇదేమీ అసాధ్యం కాదు. వాహనదారులకు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిన పెట్రోల్ ధరల్ని భారీగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. పెట్రోల్‌లో 15% మిథనాల్ కలపడం ద్వారా పెట్రోల్ ధరల్ని భారీగా తగ్గించొచ్చన్నది ప్రణాళిక. గతేడాదే నీతి ఆయోగ్ పూణెలో పరీక్షల్ని ప్రారంభించింది. హుందాయ్, మారుతీ కంపెనీల వాహనాల్లో మిథనాల్ కలిపిన పెట్రోల్‌ను పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షలు సక్సెస్ అయితే లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.10 తగ్గించొచ్చు.

మిథనాల్ బొగ్గు నుంచి ఉత్పత్తి అవుతుంది. లీటర్ రూ.25 లోపే ఉంటుంది. అదే పెట్రోల్ ధరలు చూస్తే రూ.75 వరకు ఉంది. సాధారణంగా పెట్రోల్‌, డీజిల్‌లో ఇథనాల్ కలుపుతుంటారు. లీటర్ పెట్రోల్‌లో 5 శాతం ఇథనాల్ కలుపుతారు. ఇథనాల్ చెరుకు నుంచి ఉత్పత్తి అవుతుంది. లీటర్ ఇథనాల్ ధర రూ.45 లోపు ఉంటుంది. ఇథనాల్‌తో పోలిస్తే మిథనాల్ ధర తక్కువ. అందుకే పెట్రోల్‌లో ఇథనాల్ బదులు మిథనాల్ కలిపితే ఇంధనం ధరలు భారీగా తగ్గే అవకాశముంది. అయితే మిథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం ప్రస్తుతం పరీక్షల దశల్లోనే ఉంది. పరీక్షలు విజయవంతమైన తర్వాత సామాన్య ప్రజలకు మిథనాల్ కలిపిన పెట్రోల్ అందుబాటులోకి వస్తుంది. అదే జరిగితే పెట్రోల్ ధరలు కూడా తగ్గుతాయి. అంతేకాదు... పెట్రోల్‌లో మిథనాల్ కలపడం వల్ల కాలుష్యం కూడా తగ్గుతుంది.

భారతదేశంలో పెట్రోల్ వినియోగం ఎక్కువ. మరి పెట్రోల్‌లో కలపడానికి కావాల్సినంత మిథనాల్ ఎక్కడ దొరుకుతుందన్న సందేహాలున్నాయి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశీయంగా మిథనాల్ ఉత్పత్తి చేయడంతో పాటు అవసరమైతే దిగుమతి చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది కేంద్రం. మిథనాల్ ఉత్పత్తి కోసం రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్, గుజరాత్ నర్మద ఫెర్టిలైజర్ కార్పొరేషన్, అస్సాం పెట్రోల్ కెమికల్ లాంటి కంపెనీలతో ప్రణాళికలు రూపొందిస్తోంది. మిథనాల్ దిగుమతి కోసం నీతీ ఆయోగ్ టెండర్ల ప్రక్రియ నిర్వహించనుంది. చైనా, మెక్సికో, మధ్య ప్రాచ్య దేశాల నుంచి మిథనాల్ దిగుమతి చేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?