నాగార్జున ‘బిగ్ బాస్ 3’కి ఎన్ని కష్టాలో.. రమ్మన్నా ఎవరూ రావట్లేదుగా..
తెలుగు ఇండస్ట్రీలో రియాలిటీ షోలు అంటే వింతగా చూస్తారు. అప్పట్లో ఓంకార్ ఓ షో ప్లాన్ చేస్తే పిచ్చిగాని పట్టిందా అంటూ ఆయన్ని తిట్టిపోసారు. ఆ తర్వాత అలాంటి షోనే ఇప్పుడు బిగ్ బాస్ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 2017లో మొదలైన ఈ రియాలిటీ షో పెద్ద హిట్ అయింది. ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించడంతో సీజన్ 2 కూడా వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ పుణ్యమా అని తొలి సీజన్ బ్లాక్ బస్టర్ అయితే.. రెండో సీజన్ మాత్రం హిట్ దగ్గరే ఆగిపోయింది. దాంతో ఇప్పుడు మూడో సీజన్ బ్లాక్ బస్టర్ చేయాలని నాగార్జునను తీసుకొచ్చారు షో నిర్వాహకులు.
అంతా బాగానే ఉంది కానీ ఇందులో పాల్గొనడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత తమ జీవతాలు మారిపోతాయి.. స్టార్స్ అయిపోతాం అని ముందు అంతా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ విన్నర్ శివబాలాజీ ఆ తర్వాత ఏమయ్యాడో కూడా ఎవరికీ తెలియదు. పెద్దగా అవకాశాలు రాలేదు.. అలాగని బుల్లితెరపై కూడా కనిపించడం లేదు. ఇక రెండో సీజన్ విన్నర్ కౌశల్ ఆ రోజు తర్వాత మళ్లీ కనిపించలేదు.
ఇక బిగ్ బాస్ 1, 2లలో ఉన్న వాళ్లు కూడా పెద్దగా సక్సెస్ అయింది లేదు. ఏదో అక్కడక్కడా కత్తి మహేష్ లాంటి వాళ్లు పవన్ కళ్యాణ్ పేరు వాడుకుని ఫేమస్ కావడం తప్ప.. మిగిలిన వాళ్లకు పెద్దగా ఒరిగింది కూడా ఏం లేదు. అన్నింటికి మించి డబ్బులు కూడా తక్కువే వస్తుండటంతో ఎందుకు అంత రిస్క్ అని దూరంగా ఉంటున్నారు సెలబ్రిటీస్.
పేరున్న వాళ్లెవ్వరూ ఇంటికి 100 రోజులు దూరంగా ఉండటానికి ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. దాంతో కాస్త పేరున్న వాళ్లైనా ఓకే అని సర్దుకుపోతుంది స్టార్ మా.. జులై 21న దీన్ని మొదలుపెట్టాలని చూస్తున్న వాళ్లకు ఇప్పటి వరకు ఇంకా అందులో పాల్గొనే కంటెస్టెంట్సే ఫైనల్ కాకపోవడంతో టెన్షన్ పెరిగిపోతుంది. మరి చూడాలిక.. చివరి వరకు ఏం జరుగుతుందో..?
Comments
Post a Comment