ఎట్టకేలకు సైకిళ్లకు మోక్షం ... - 8న బాలికలకు అందజేత ..
అమరావతి :
బాలికల చేతికి అందాల్సిన సైకిళ్లకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ నెల 8న వీటిని అందించాలని లపాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి అదేశాలు జారీ చేశారు.
2018-19 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న 8, 9 విద్యార్థినులకు సైకిళ్లు అందజేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇందుకు గత బడ్జెట్‌లో రూ.160 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,81,142 మంది ఉన్నట్లు విద్యాశాఖ లెక్కతేల్చి టెండర్లను పిలిచింది.
ఒక్కో సైకిల్‌కు రూ.4198 చొప్పున టెండర్‌ను ఖరారు చేసింది. మార్చి నాటికి అన్ని సైకిళ్లు పాఠశాల గొడౌన్లకు చేరాయి.
ఎన్నికల కోడ్ రావడంతో వీటిని పిల్లలకు అందజేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
సుమారు నాలుగు నెలల పాటు సైకిళ్లు గొడౌన్లలో పడి ఉన్నాయి. ఇప్పుడు వీటిని పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రాజన్న బడిబాట కార్యక్రమం కింద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8న వీటిని పంపిణీ చేయాలని ఆర్‌జెడిలు, డిఇవోలకు ఆదేశాలు జారీ చేశారు.
గత విద్యా సంవత్సరంలో 8,9 విద్యార్థుల కోసం వీటిని కేటాయిం చారు. ఇప్పుడు వారు 9, 10 తరగతుల్లో చేరారు.
దీంతో 9,10 తరగతుల విద్యార్థులకే పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం మారడంతో లోగో కూడా సైకిళ్లపై మారింది. టిడిపి ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యాశాఖ కొనుగోలు చేసింది.
ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫొటోలతో బడిబాట లోగో ఉండేది.
ఈ లోగో తీసేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలతో కూడిన లోగోలతో సైకిళ్లను విద్యాశాఖ అందజేయనుంది.
Comments
Post a Comment