ఏపీ బడ్జెట్లో జగన్ పెద్దపీట వేసింది వీటికే.
ఏపీ అప్పుల ఊబిలో కూరుకున్నప్పటికీ వైసీపీ మ్యానిఫెస్టో కేంద్రంగా సంక్షేమ రథాన్ని పరుగులు తీయిస్తామని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. 2019-20 సంవత్సరానికి 2 లక్షల 27 వేల కోట్ల రూపాయలతో ఏపీ బడ్జెట్ ను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. నవరత్నాలకు ప్రాధాన్యమిస్తూనే విద్య, వైద్య రంగాలకు అత్యధిక కేటాయింపులు చేశారు. ప్రస్తుతం రూపాయికి 60 పైసలు మాత్రమే ఆదాయం కలిగిన ఏపీలో ఆర్ధిక క్రమశిక్షణ ద్వారా అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా పరుగులు తీయిస్తామని ఆర్ధికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ధీమా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీ అమలుతో పాటు విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశారు. ప్రభుత్వం అత్యధికంగా విద్యా రంగానికి రూ.32,618 కోట్లు కేటాయించింది. వైఎస్ హయాంలో విజయవంతంగా అమలైన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ‘జగనన్న విద్యా దీవెన’గా అమలు చేయాలని నిర్ణయించారు. పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. జగనన్న అమ్మఒడికి రూ.6455 కోట్లు ఖర్చుచేయనున్నారు.
విద్య తర్వాత వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రూ.11,399 కోట్లు వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. వైఎస్ హయాంలో విజయవంతమైన మరో పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్సార్ పేరుతో అమలు చేయాలని నిర్ణయించారు. వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న ప్రతీ ఒక్క కుటుంబాన్నీ ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చారు. ఆరోగ్య శ్రీ పథకం అమలు కోసం రూ.1,740 కోట్లు కేటాయించారు. పేదల వైద్యానికి అవసరమైన పూర్తిస్థాయి నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్ధికమంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ప్రతీ మండలంలో 108 వాహనం ఉండాలని సీఎం జగన్ ఆదేశించినట్లు బుగ్గన వెల్లడించారు.
ప్రభుత్వానికి అత్యంత కీలకమైన వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు కేటాయించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు వీలుగా వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలుకు రూ.8,750 కోట్లు కేటాయించారు. ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు వెచ్చించనున్నారు. గ్రామీణాభివృద్ధికి రూ.29,329 కోట్లు బడ్జెట్ ఇచ్చారు. ఆక్వారైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం రూ.475 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. విత్తనాల పంపిణీకి రూ.200 కోట్లు ఇవ్వనున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ.4,525 కోట్లు కేటాయించారు. ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2001 కోట్లు వెచ్చించనున్నారు. వైఎస్సార్ రైతు బీమాకు రూ.1,163 కోట్లు ఇస్తున్నారు.
విద్యుత్ రంగానికి రూ.6860 కోట్లు, గృహరంగానికి రూ.3,617 కోట్లు, సంక్షేమ రంగానికి రూ.14,142 కోట్లు, మధ్యాహ్న భోజన పధకానికి రూ.1,077 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో దాదాపు 40 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలని భావిస్తున్న జగన్ సర్కారు... ఇందుకోసం భారీగా కేటాయింపులు చేసింది. పాఠశాల నిర్వహణ గ్రాంట్లకు రూ.160 కోట్లు, పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,500 కోట్లు వెచ్చించనున్నారు. సంక్షేమ రంగానికి కూడా జగన్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా వికలాంగుల పెన్షన్ల కోసం రూ.2,133.62 కోట్లు, వృద్ధులు, వితంతువుల పెన్షన్లకు రూ.12,801 కోట్లు కేటాయించారు. దళితుల అభివృద్ధికి రూ.15,000 కోట్లు, గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లు, బీసీల అభివృద్ధికి రూ.1,561 కోట్లు కేటాయించారు.
రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 25 లక్షల గృహాలను నిర్మించాలని భావిస్తున్న సర్కారు.. వైఎస్సార్ గృహ వసతి పథకం అమలు కోసం ఈ బడ్జెట్ లో రూ.5,000 కోట్లు కేటాయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.31,564.75 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,140 కోట్లు వెచ్చించనున్నారు. త్వరలో ప్రభుత్వంలో విలీనం కానున్న ఆర్టీసీకి రూ.1,000 కోట్లు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రత్యేక హోదా డిమాండ్ ను కూడా ఆర్ధిక మంత్రి బుగ్గన తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రధాని మోదీతో వివిధ సమావేశాల సందర్భంగా సీఎం జగన్ ప్రత్యేక హోదా అవసరాన్ని స్పష్టంగా చెప్పారని బుగ్గన తెలిపారు. గత ప్రభుత్వ విధానాలను కూడా ఆర్ధికమంత్రి తన ప్రసంగంలో ఎండగట్టారు. ముఖ్యంగా రెండంకెల ఆర్ధిక వృద్ధి ఉంటే అన్నదాతల ఆత్మహత్యలు ఎందుకు జరిగాయని ఆర్ధిక మంత్రి ప్రశ్నించారు.
Comments
Post a Comment