ప్రస్తుతం తెలిసిన వారిని కూడా నమ్మడానికి వీలు లేకుండా పోతోంది.
భవానీపురం: ప్రస్తుతం తెలిసిన వారిని కూడా నమ్మడానికి వీలు లేకుండా పోతోంది. ఒక వృద్ధురాలి వద్ద నమ్మకంగా ఉండే ఒక వ్యక్తి ఆమె ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భవానీపురం పోలీసుల వివరాల ప్రకారం.. రావుల రమణకుమారి(65) విజయవాడ వన్‌టౌన్ విద్యాధరపురం చెరువు సెంటర్‌లోని రాజు గారి వీధిలో నివాసం ఉంటోంది. ఆమె వడ్డీ వ్యాపారం చేస్తుంది. ఆమె వద్దకు వడ్డీ డబ్బులు ఇచ్చేందుకు చింతగింజ శ్రీనివాసరావు అనే ఆటోడ్రైవర్ తరచూ వచ్చి వెళ్తుంటాడు. శుక్రవారం రాత్రి డబ్బులు తీసుకొని వస్తున్నట్లు రమణకుమారికి అతను ఫోన్ చేసి చెప్పాడు. అయితే డబ్బులతో పాటు తనకు బిర్యానీ తీసుకురావాలని కోరింది. ఆమె చెప్పినట్లుగానే బిర్యానీ తీసుకుని మందుల దుకాణానికి వెళ్లి మత్తు మాత్రలు కొనుగోలు చేశాడు. వాటిని బిర్యానీలో కలిపి ఆమెకు ఇచ్చాడు. బిర్యానీ తిన్న రమణకుమారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తరువాత శ్రీనివాసరావు, ఆమె ఇంట్లోని బీరువాలో ఉన్న ఆరు బంగారు గాజులు(72 గ్రాములు), చంద్రహారం (28గ్రాములు), బంగారం చైను (9 గ్రాములు) తీసుకుని పరారయ్యాడు. ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని సమీపంలో ఉండే రావుల విజయకుమారి శనివారం తెల్లవారుజామున గుర్తించింది. ఆపై ఆటోనగర్‌లో నివాసం ఉండే వృద్ధురాలి కుమార్తె ఆళ్ల సుధారాణికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వగా... వారొచ్చి ఫోన్‌లోని నెంబర్లను పరిశీలించారు. ఆపై చుట్టుపక్కల వారిని ప్రశ్నించారు. శ్రీనివాసరావు ఇంటికి వచ్చి వెళ్లినట్లు తెలుసుకున్నారు. ఆపై విద్యాధరపురం రాము క్వారీ ప్రాంతంలోని ఒకరి ఇంట్లో ఉండే శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతోంది. సుధారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవానీపురం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా... తమ ఇంట్లో నమ్మకంగా ఉంటూ దొంగతనానికి పాల్పడి పరువు తీశాడంటూ శ్రీనివాసరావు ఉండే ఇంటి యజమాని కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వృద్ధురాలికి బిర్యానీలో మత్తు మందు కలిపి ఇచ్చిన శ్రీనివాసరావు నగలు అపహరించి తాను ఉండే నివాసానికి వెళ్లాడు. గత నాలుగేళ్లు వారి ఆటో నడుపుతూ వారింట్లోనే నమ్మకంగా ఉంటున్నాడు. శనివారం అతనిని వెతుక్కుంటూ పోలీసులు వారి ఇంటికి వెళ్లి ఆయన వద్దనున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నమ్మకంగా ఉంటూ తమను మోసగించాడని భావించిన యజమాని కుమార్తె మనస్తాపానికి గురై బాత్‌రూంలోని లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతోంది. భవానీపురం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Comments
Post a Comment