నేడు అల్లూరి సీతారామరాజు జయంతి!

బ్రిటిషు పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం ప్రాంత విప్లవ వీరుడు!!

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు(జూలై 4, 1897 - మే 12, 1924  ఒక మహోజ్వల శక్తి.
ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

బ్రిటీషు అధికారుల దురాగతాలు..

ఈ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా 0ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. రక్షిత అటవీప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది.

మన్యం ప్రజలలో సీతారామరాజు తెచ్చిన చైతన్యం..

మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు.

మరణం:

17-4-1924న మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ నియమితుడయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరుగలిగినవాడు..

విప్లవకారులలో అగ్గిరాజు (అసలు పేరు వేగిరాజు సత్యనారాయణ రాజు. అయితే శత్రువుల గుడారాలకు నిప్పుపెట్టి హడలుకొట్టే సాహసిగనుక "అగ్గిరాజు" అనే పేరు వచ్చింది.) అతిసాహసిగా పేరు పొందాడు. ప్రభుత్వాధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. ఆహార ధాన్యాలు కొల్లగొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు. 1924 మే 6వ తారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజు కాలికి గాయమైంది. శత్రువులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణించాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పంపారు. అక్కడే మరణించాడు. ఆ రాత్రి రాజు మంప గ్రామానికి వచ్చాడు.

అంతకుముందు రూథర్ ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవు పేట సభకు మంప మునసబు కూడా హాజరయ్యాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవు పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు.

తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు. తరువాత,1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట.. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి సీతారామరాజు ను బంధించారు. 

కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేశి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు.తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు.మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?