జగన్ హామీలు చూస్తే భయమేస్తోంది... మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న హామీ చూస్తే తనకు భయమేస్తోందని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. జగన్ నెల రోజుల పాలన ఏ రకంగా ఉందనే అంశంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని అభిప్రాయపడ్డారు. అయితే ఆయన తీసుకుంటున్న అనేక నిర్ణయాలు తనకు సహేతుకంగా అనిపించడం లేదని నాదెండ్ల వివరించారు. అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి కోసం నగదు ఇస్తామని జగన్ ప్రకటించాడని... అయితే ఇందుకోసం నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తనకు అర్థంకావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉందని... ఇలాంటి సమయంలో అలాంటి హామీలు ఇవ్వడం సరికాదని అన్నారు.
వైఎస్ జగన్ గ్రామాల్లో వాలంటీర్లను నియమించాలని చేసిన ఆలోచన కూడా సక్సెస్ అవుతుందని తాను భావించడం లేదని నాదెండ్ల భాస్కర్ రావు అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో ఈ వ్యవస్థ సరికొత్త సమస్యలను సృష్టించే అవకాశం ఉందని ఆయన అన్నారు. కేబినెట్‌లో అనుభవం ఉన్న వ్యక్తులు ఉండాల్సిన అవసరం ఉందని... కానీ జగన్ కేబినెట్ మాత్రం అలా లేదని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు వెల్లడించారు. అయితే ప్రజలకు ఏదో చేయాలనే తపన మాత్రం జగన్‌లో కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Post a Comment