టిస్ విద్యాసంస్థలో ఆందోళన...నిరహారదీక్షకు దిగిన విద్యార్థులు
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెన్ (టిస్) విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. హాస్టల్ ఫీజులు తగ్గించాలంటూ... గత కొన్నిరోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. ఆందోళన మరింత ఉధృతం కావడంతో విద్యార్థులు నిరాహార దీక్షకు దిగుతున్నారు. ఎనిమిది మంది విద్యార్థులు హంగర్ స్ట్రైక్ చేపట్టారు. వెంటనే యాజమాన్యం తమ సమస్యల్ని తీర్చాలంటూ డిమాండ్ చేశారు. అయితే విద్యార్థులకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న సంస్థ కూడా తమ నిర్ణయాన్ని యాజమాన్యం చేతిలోనే పెట్టింది. అయితే టిస్ అధికారులెవరూదీనిపై నోరు మెదపక పోవడంతో విద్యార్థులు మండిపోతున్నారు.
తమకు ప్రభుత్వం ఏటా ఇస్తున్న స్కాలర్ షిప్ కంటే మెస్ ఫీజే ఎక్కువగా ఉందంటూ ఆరోపిస్తున్నారు. అంతలా ఫీజులు వసూలు చేస్తున్నా కూడా నాణ్యమైన ఆహారం అందించడం లేదని విమర్శిస్తున్నారు. గతనెలలో హాస్టల్ ఫుడ్ తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైయ్యారని చెబుతున్నారు.గతవారంలో నలుగురు విద్యార్థులు తీవ్ర కడపునొప్పితో ... ఎల్బీనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారన్నారు. మరికొందరు కూడా మెస్ ఫుడ్ తిని అనారోగ్యం పాలైయ్యారని ఆరోపిస్తున్నారు. దీంతో చాలామంది విద్యార్థులు హాస్టల్ మెస్‌లో ఫుడ్ తినడం మానేశారని చెబుతున్నారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన చాలామంది విద్యార్థులు.. ఫీజులు తగ్గించకపోతే.. చదువు మానేసి మధ్యలోనే వెళ్లిపోతారని అంటున్నారు. యాజమన్యం వెంటనే స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించకపోతే.. చాలామంది విద్యార్థులు కోర్సును మధ్యలోనే ఆపేసి డ్రాప్ అయిపోతారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు
విద్యార్థుల డిమాండ్లపై స్పందించిన టిస్ డిప్యూటీ డైరెక్టర్ యు. వింద్యా అన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని ముంబైలో ఉన్న పై అధికారులకు పంపించామన్నారు. అక్కడ్నుంచి మరో రెండురోజుల్లో సమాధానం వస్తుందని భావిస్తున్నామన్నారు. జూలై 15వరకు విద్యార్థుల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు.
Comments
Post a Comment