టీడీపీ హయాంలో ఆ ఒక్కదాంట్లోనే అభివృద్ది.. వైవీ సుబ్బారెడ్డి
టీడీపీ హయాంలో కేవలం దోచుకోవడంలో మాత్రమే అభివృద్ది జరిగిందని టీటీడీ ఛైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టి పెట్టారని.. ఆ అవినీతిని కచ్చితంగా వెలికితీస్తామన్నారు. దీంతోపాటు టీడీపీ పాలనలో టీటీడీలో జరిగిన అవకతవకలను కూడా వెలికితీస్తామని చెప్పారు. టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా నియమితులైన తర్వాత తొలిసారి ఆయన ఒంగోలులో పర్యటించారు. దీంతో వైవీ సుబ్బారెడ్డికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత సీఎం జగన్ తీసుకున్నారని.. మొదటి టన్నెల్ పూర్తిచేసి జిల్లాకు నీరిస్తామన్నారు. ప్రకాశం జిల్లాలో దుగరాజపట్నం బదులు రామాయపట్నం టేకప్ చేయాలని కేంద్రం చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని సుబ్బారెడ్డి అన్నారు.. కృష్ణపట్నం వాళ్లు ఇచ్చే క్యాష్ కోసమే ప్రకాశం జిల్లాను చంద్రబాబు నాశనం చేశారని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. దొనకొండ పారిశ్రామికవాడలో పరిశ్రమల ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడానని.. త్వరలోనే పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించి... ప్రకాశం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఏ ఏ జిల్లాలలో పారిశ్రామికాభివృద్ధి అవసరమో దానికోసం కూడా సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
Comments
Post a Comment