బీజేపీలోకి మరో టీడీపీ ముఖ్యనేత... ఎంపీ రాయబారం ?

ఏపీలోనే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీడీపీపై తెలంగాణ నేతల్లో ఆశలు పూర్తిగా అవిరయ్యాయి. అందుకే ఎన్నికలకు వరకు టీటీడీపీలో కొనసాగుతూ వచ్చిన తెలుగు తమ్ముళ్లు సైతం... ఇప్పుడు తమ దారి తాము చూసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మాజీమంత్రి పెద్దిరెడ్డి, చాడ సురేశ్ వంటి టీటీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వినిపించాయి. తాజాగా టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆ జాబితాలో చేరే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. 

ఉత్తర తెలంగాణలో కీలకమైన వరంగల్ జిల్లాలో బలపడేందుకు వ్యూహరచన చేస్తున్న బీజేపీ... ఇందుకోసం పేరున్న నేతలను ఆకర్షించాలని భావిస్తోంది. ఈ బాధ్యతను ఇటీవల పార్టీలో చేరిన ఎంపీ గరికపాటి మోహన్ రావుకు అప్పగించినట్టు సమాచారం. దీంతో ఆయన మాజీమంత్రి రేవూరిని బీజేపీలోకి తీసుకెళ్లేందుకు చర్చలు కూడా జరిపినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని గరికపాటి బీజేపీ ముఖ్యనేతలతో హామీ కూడా ఇప్పించారని తెలుస్తోంది. 

తెలంగాణలో టీడీపీ ఎలాగూ మనుగడ కొనసాగించే పరిస్థితి లేదని... అందుకే పార్టీ మారడం మేలు అని రేవూరిపై అనుచరగణం కూడా ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో త్వరలోనే ఆయన బీజేపీలో చేరడంపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం మొదలైంది. మొత్తానికి రేవూరి కూడా టీటీడీపీని వీడితే... తెలంగాణలో ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్టే అని చెప్పొచ్చు. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?