రామ్ చరణ్ సినిమా బాలీవుడ్‌కు వెళ్తుంది.. దిల్ రాజు నిర్మాతగా అక్కడ..
రామ్ చరణ్ తెలుగు ప్రేక్షకులకే కాదు హిందీలో కూడా తెలుసు. ఫ్లాప్ సినిమా చేసినా కూడా జంజీర్‌తో అక్కడ కూడా పరిచయం అయ్యాడు మెగా వారసుడు. అదృష్టం బాగోలేక ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ హిందీలోకి వెళ్లడం లేదు. హాయిగా ఇక్కడే సినిమాలు చేసుకుంటున్నాడు మెగా పవర్ స్టార్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన సినిమా ఒకటి బాలీవుడ్ దర్శక నిర్మాతలకు బాగా నచ్చేసింది. దాంతో వెంటనే అక్కడ రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఐదేళ్ల కింద చరణ్ హీరోగా వచ్చిన ఎవడు సినిమా సంక్రాంతికి వచ్చి మంచి విజయం సాధించింది.
ఈ సినిమా చూసిన హిందీ నిర్మాత నిఖిల్ అద్వాని ఫిదా అయిపోయాడు. ఇలాంటి కథను కాస్త మార్చి బాలీవుడ్ హీరోతో తెరకెక్కిస్తే భారీ విజయం సాధిస్తుందని చెప్పడంతో దిల్ రాజు కూడా ఇప్పుడు ఇందులో భాగస్వామిగా మారాడు. తెలుగులో ఈ సినిమాను నిర్మించింది కూడా ఆయనే. 2014లో విడుదలైన ఈ చిత్రంలో అల్లు అర్జున్ అతిథి పాత్రలో నటించాడు. ఈ సినిమాను అక్కడ దిల్ రాజుతో కలిసి నిఖిల్ అద్వానీ రీమేక్ చేయనున్నాడని తెలుస్తుంది.
ఈ సినిమాను హేట్ స్టోరి 4 తెరకెక్కించిన దర్శకుడు మిలాప్ జవేరి చేతుల్లో పెడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైపోయింది. మరి అక్కడ రామ్ చరణ్, అల్లు అర్జున్ పాత్రల్లో ఎవరు నటిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. కాజల్, శృతిహాసన్, అమీ జాక్సన్ ఇక్కడ హీరోయిన్లుగా కనిపించారు. స్టార్ హీరోతోనే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నారు. మరి బాలీవుడ్ ఎవడుగా ఎవరు నటిస్తారో చూడాలి.
Comments
Post a Comment