మాయమాటలతో పలువురు మహిళలను వంచించి అశ్లీల వీడియోలు తీసిన ఘటన
మొగల్తూరు: మాయమాటలతో పలువురు మహిళలను వంచించి అశ్లీల వీడియోలు తీసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు వాట్సాప్ గ్రూపుల ద్వారా వ్యాపించడంతో బాధిత యువతి ఒకరు ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొగల్తూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో సెల్‌ఫోన్లను మరమ్మతులు చేసుకుంటూ ఉపాధి పొందే ఒక యువకుడు మాయమాటలతో పలువురు యువతులు, మహిళలను వంచించాడు. వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియో తీశాడు. ఫోన్ల మరమ్మతు పనులు నేర్చుకునేందుకు ఈ దుకాణంలో చేరిన మరో యువకుడు ఈ వీడియోలను గమనించి చోరీ చేసి గ్రామంలో మరికొంత మందికి పంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఓ వ్యక్తి ఆ వీడియోలన్నీ సేకరించి వాటి ఆధారంగా బాధ్యుడిని సొమ్ము కోసం డిమాండు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బేరం కుదరకపోవడంతో కొన్ని అశ్లీల వీడియోలను పలు వాట్సాప్ గ్రూపుల్లో ఉంచినట్లు సమాచారం. దీంతో బాధితుల్లో ఓ యువతి మొగల్తూరు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తితోపాటు డేటా చోరీకి పాల్పడిన మరో యువకుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి నుంచి అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడి సొమ్ము డిమాండు చేసిన వ్యక్తినీ పోలీసులు అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ వ్యక్తి కొందరు రాజకీయ నాయకులను ఆశ్రయించగా వారు కేసును నీరుగార్చినట్లు తెలిసింది.
Comments
Post a Comment