కియా మోటార్స్ వెనుక అసలు కథ ఇదీ.. బాబు క్రెడిట్ ఏమీ లేదు : బుగ్గన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనల ఖర్చులపై వాడి వేడి చర్చ జరిగింది. తాను ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేశానని.. తాను విదేశాల్లో పర్యటించడం వల్లే అనంతపురంలో కియా మోటార్స్ ఏర్పాటైందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాన్ని నంబర్.1గా నిలిపామని పేర్కొన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు ఆర్థికమంత్రి బుగ్గన కౌంటర్ ఇచ్చారు. 

దేశ ఐటీ ఉత్పత్తుల్లో 85శాతం బెంగళూరులో జరుగుతోందని.. కానీ ఏనాడు అక్కడి మాజీ సీఎం సిద్దరామయ్య తనవల్లే రాష్ట్రానికి ఐటీ వచ్చిందని చెప్పలేదని బుగ్గన గుర్తుచేశారు. అలాగే తమిళనాడులోనూ 15శాతం ఐటీ ఉత్పత్తులు జరుగుతున్నాయని..అక్కడ కూడా ఏ సీఎం తనవల్లే ఇదంతా జరిగిందని చెప్పుకోలేదన్నారు. అంతకుమించి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏనాడు విదేశాలకు వెళ్లిన దాఖలా లేదన్నారు. కానీ చంద్రబాబు మాత్రం మాట్లాడితే.. పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లానని చెబుతున్నారని.. కానీ వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయని చెప్పారు.

ఈ సందర్భంగా 13 జూన్,2019న కియా మోటార్స్ కార్పోరేషన్ సీఈవో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖను సభలో బుగ్గన చదివి వినిపించారు. జగన్ సీఎం అయినందుకు శుభాకాంక్షలు తెలిపిన కియా సీఈవో.. గతంలో రాజశేఖర్ రెడ్డితో తన పరిచయాన్ని ఆ లేఖలో గుర్తుచేసుకున్నారు. 2007లో తాను హైదరాబాద్ హ్యుందయ్ ఫ్యాక్టరీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డిని కలిసినట్టు అందులో తెలిపారు. ఆ సందర్భంగా రాయలసీమలో హ్యుందయ్ ఫ్యాక్టరీ పెట్టాలని వైఎస్ కోరారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కచ్చితంగా అక్కడ ఫ్యాక్టరీ పెడుతామని మాటిచ్చామని.. ఇచ్చిన మాట ప్రకారం అనంతపురంలో కియా మోటార్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆనాడు ఇచ్చిన వాగ్దానం మేరకు కియా మోటార్స్ తమ సంస్థను అనంతపురంలో నెలకొల్పిందని బుగ్గన తెలిపారు. అంతే తప్ప.. చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లడం వల్ల ఇది ఏర్పాటు కాలేదన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉందని..అందుకే సభలో లేఖను చదివి వినిపించానని స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?