అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను సమర్థించను.. : స్పీకర్‌తో చంద్రబాబు
ఏపీ అసెంబ్లీలో మంగళవారం సభ ప్రారంభం కాగానే అధికార-ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై స్పీకర్ సహా అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో సమయం కేటాయింపుపై అభ్యంతరం తెలిపిన అచ్చెన్నాయుడు.. 'ఇక మీరే రాసివ్వండి.. నేను చదువుతాను' అని స్పీకర్‌ను ఉద్దేశించి అన్నారు. దీంతో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను సమర్థిస్తారా అని టీడీపీ అధినేత చంద్రబాబును అడిగారు. అందుకు చంద్రబాబు సమర్థించడం లేదని బదులిచ్చారు.
అయితే తనపై వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? అని స్పీకర్‌ను ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. ఒకప్పుడు ఎన్టీఆర్ సభలో మాట్లాడుతానని ఎంత ప్రాధేయపడినా ఆయనకు మైక్ ఇవ్వలేదని.. సొంత మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసని రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పీకర్‌ను చంద్రబాబు ప్రశ్నించగా.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అభ్యంతరం తెలిపారు.సభలో అత్యంత సీనియర్ అయిన ఓ నాయకుడు స్పీకర్‌ను ఇలా ప్రశ్నించడమేంటని అడిగారు. రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా అని ప్రతిపక్ష నేతను అడగాల్సిందిపోయి.. స్పీకర్‌ను అడగడమేంటని ప్రశ్నించారు. ఇదే విషయంపై సభలో గందరగోళం నెలకొనగా.. హుందాగా ముందుకెళ్దామని,ఇక ఇష్యూకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని స్పీకర్ సూచించారు.
Comments
Post a Comment