నీరే జీవం - లేకపోతే నిర్జీవం.. జలసంరక్షణపై నిజామాబాద్ నినాదం
మానవ జీవితంలో నీరు చాలా విలువైంది. నీరు లేకుండా జీవనం సాధ్యం కాదు. ప్రకృతి సహకరించాక వర్షాలు లేక నీటి కోసం పరితపిస్తున్నారు కొన్ని ప్రాంతాలవారు. వర్షపు నీటిని వృధాగా పోనీయకుండా ఒడిసి పట్టుకుందాం.. భావితరాలకు నీటి కష్టాలు లేకుండా చేయాల్సిన బాధ్యత నేటి తరంపై ఉంది. ఆ దిశగా నిజామాబాద్ నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. నిజామాబాద్ నగరంలో నీటి కష్టాలు తీర్చేందుకు నగరపాలక సంస్థ ప్రణాళిక రూపొందించింది. చుక్క వర్షపు నీటిని కూడా వృథాగా పోనివ్వద్దని ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. నీరు లేక చాలా ప్రాంతాలు విలవిలలాడుతున్నాయి. అలాంటి పరిస్థితులు మనకు ఎదురుకావద్దంటే నీటిని వృథాగా పోనివ్వద్దు.. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టడం ద్వారా భూగర్బ జాలాలు వృద్ది చెందుతాయి
నిజామాబాద్ నగరంలో నూతనంగా నిర్మించే ప్రతి ఇంటికి ఇంకుడుగుంత నిర్మిస్తేనే ఇంటి పర్మిషన్ ఇస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుంటున్నారు. 2016లోనే నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత ఇంటి ముందు ఇంకుడు గుంత నిర్మించి ఆందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ విధంగా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని సద్వినియోగ పరుచుకుంటున్నారు.
జల సంరక్షణ మీద అవగాహన ఉన్నవారు కూడా వారి ఇళ్లల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకుంటున్నారు. నీరు ఎంత విలువైంది? నీటి ఉపయోగం ఏ విధంగా ఉంటుంది?, నీరు లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి?, అనేది తెలిసిన ప్రతి ఒక్కరు నీటిని ఆదా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వాల్ పెయింట్ లు ఏర్పాటు చేసారు. దీంతో ప్రజల్లో అవగాహన ఏర్పడుతుంది. దీంతో నగరంలో 50శాతం వరకు ఇళ్లల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటయ్యాయి.. వర్షపు నీరు వృధా కాకుండా భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి అనే విషయం కళ్లకు కట్టినట్టు గోడలపై చిత్రించారు.
Comments
Post a Comment