జగన్‌పై ఇద్దరు టీఆర్ఎస్ నేతల ఆశలు... కేసీఆర్ కరుణిస్తారా ?
నామినేటెడ్ పదవులంటే నేతలకు ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులు సైతం తమకు ఏదో ఒక నామినేటేడ్ పోస్టు కావాలని కోరుకుంటుంటారు. తాజాగా తెలంగాణకు ఇద్దరు నాయకులు కూడా తమకు నామినేటేడ్ పోస్టు కావాలని ఆశపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరు నేతలు కావాలనుకుంటున్న నామినేటేడ్ పోస్ట్ ఏపీలో కావడం విశేషం. ఆ ఇద్దరు నాయకుల్లో ఒకరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మరొకరు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
టీఆర్ఎస్ నాయకులైన ఈ ఇద్దరు నేతలు ఒకప్పటి వైసీపీ నేతలే. టీటీడీ పాలకమండలిలో ఛాన్స్ కోసం ఈ ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ఏర్పడిన తరువాత టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్... రెండోసారి కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక తెలంగాణ వచ్చిన తరువాత కూడా ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి... కాలక్రమంలోనే టీఆర్ఎస్‌లో చేరారు.
అయితే ఈ ఇద్దరు నాయకులకు ఇప్పటికీ వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌తో మంచి సంబంధాలే ఉన్నాయని వారి సన్నిహితులు చెబుతుంటారు. కేసీఆర్ ఓకే చెబితే... తెలంగాణ కోటాలో టీటీడీలో దక్కబోయే రెండు పోస్టులు తమకు వస్తాయని ఈ ఇద్దరు భావిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఈ ఇద్దరు నేతలు టీఆర్ఎస్ అధినాయకత్వం చెవిన వేశారని తెలుస్తోంది. అయితే దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మొత్తానికి జగన్‌పై ఆశలు పెట్టుకున్న ఆ ఇద్దరు టీఆర్ఎస్ నేతల్లో ఎవరి కోరిక నెరవేరుతుందో చూడాలి.
Comments
Post a Comment