చినుకమ్మా ఎక్కడ నీ చిరునామా.. వానల్లేక తల్లడిల్లుతున్న అన్నదాతలు..
నైరుతి రుతుపవనాలు కదిలి వస్తుంటే రైతన్న మోము చిగురించింది.. ఇక జోరు వానలు పడతాయని, పంటలు బాగా పండుతాయని ఆశపడ్డాడు.. జూన్ ఒకటో వారం నుంచి నాలుగో వారం వరకు కళ్లు కాయలు కాచేలా వేచి చూశాడు.. కానీ, నిరాశే మిగిలింది. నైరుతి రుతు పవనాలు చాలా ఆలస్యంగా రావడంతో వర్షపాతం లోటు భారీ స్థాయికి చేరింది. గత ఐదేళ్లలో ఎన్నడూలేనంతగా తెలంగాణలో జూన్ నెల వర్షపాతం లోటు 35 శాతంగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 35 శాతంగా ఉన్నా.. జిల్లాల వారీగా చూస్తే ఇంతకన్నా ఎక్కువ లోటు ఏర్పడింది. అత్యధికంగా ఖమ్మంలో వర్షపాతం లోటు 73 శాతంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వర్షపాతం లోటు ఉన్న జిల్లా ఇదే కావడం గమనార్హం.
నిజానికి, జూన్ నెలలో కురవాల్సిన వర్షపాతం 132 మిల్లీమీటర్లు కాగా, కురిసింది 86.2 మిల్లీమీటర్లు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో 20 శాతానికి మించి లోటు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 385 మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. 115 మండలాల్లో వర్షపాతం లోటు 60 నుంచి 99 శాతం వరకు ఉంది.
దీని కారణంగా చెరువులు, కుంటలు, వాగుల్లో నీటి మట్టం దారుణ స్థితిలో ఉంది. దీంతో వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రైతులు ఇంకా వరి నాట్లు వేయనేలేదు. అయితే, జూలైలో సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Comments
Post a Comment