ఇంజినీరింగ్ ఫీజుల నిర్ణయాధికారం తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ : ఇంజినీరింగ్ ఫీజుల నిర్ణయాధికారం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రుసుముల నియంత్రణ కమిటీకే ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వాసవి, శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల వ్యవహారంలో సోమవారం తీర్పు వెలువరించిన ధర్మాసనం.. కమిటీ ఎంత నిర్ణయిస్తే కళాశాలలు అంతే వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అధిక ఫీజులు వసూలు చేస్తునన్నారంటూ వాసవి కళాశాల పేరెంట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేయగా.. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ వాదనల తర్వాత గత ఏప్రిల్ 10న తీర్పును రిజర్వ్ చేసింది.
సోమవారం జస్టిస్ నవీన్ సిన్హా తీర్పును చదివి వినిపించారు. వాసవి కళాశాలల ఫీజుల విషయంలో రాష్ట్ర హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందని అభిప్రాయపడ్డ సుప్రీం.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. వాసవి కళాశాల ఫీజులను టీఏఎఫ్ఆర్సీ రూ.85 వేలుగా నిర్ణయించగా.. కమిటీ నిర్ణయంపై వాసవి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. విచారణలో ఫీజుపై సమీక్షించిన కమిటీ 97 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కళాశాల యాజమాన్యం ప్రతిపాదించిన లక్షా 60 వేల రూపాయలనే ఫీజుగా నిర్ణయిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో పేరెంట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి తమ వాదనలను వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తల్లిదండ్రులు, తెలంగాణ ప్రభుత్వం వాదనలకు మద్దతుగా తీర్పునిచ్చింది. ఇప్పటికే అధిక ఫీజులు చెల్లించిన విద్యార్థులకు వారు చెల్లించిన అధిక మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని మార్గదర్శకాలను ఇచ్చింది. ఫీజుల నిర్ణయాధికారం కమిటీదేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది
Comments
Post a Comment