నాకు ప్రాణ హాని ఉంది : కాగజ్‌నగర్ ఫారెస్ట్ ఆఫీసర్ అనిత ఆవేదన..

కుమ్రం భీమ్ జిల్లాలోని కాగజ్‌నగర్ పరిధిలో ఉన్న సార్సాలా గ్రామంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ అనుచరుల దాడిలో గాయపడిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత సోమవారం మీడియా ముందుకు వచ్చారు.దాడిలో గాయపడి ఆస్పత్రిలో చేరిన అనిత.. డిశ్చార్జి తర్వాత మీడియాతో మాట్లాడారు. యూనిఫాం వేసుకున్న ఒక అధికారిగా తన విధులను తాను నిర్వర్తించానని చెప్పారు. అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లడానికి ముందు అక్కడి గ్రామస్తులతో మీటింగ్ పెట్టి మరీ వారికి వివరించామని తెలిపారు. అయినప్పటికీ ఆరోజు కొంతమంది గ్రామస్తులు అడ్డుపడటంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ.. పోలీసులను నెట్టివేసి గ్రామస్తులతో కలిసి కర్రలతో దాడి చేశాడని చెప్పారు. కొట్టవద్దని ఎంత వేడుకున్నా.. పశువుల కన్నా దారుణంగా తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా తాను అక్కడ విధులు నిర్వహిస్తున్నానని.. అధికారులపై ఇలాంటి గుండాయిజం, జులుం చాలాకాలంగా కొనసాగుతోందని అన్నారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్లు తనను మళ్లీ టార్గెట్ చేసే ప్రమాదం ఉందని చెప్పారు. కాబట్టి ఇలాంటి మరో ఉదంతం జరగకముందే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. సమాజానికి ఏదో మంచి చేద్దామన్న ఉద్దేశంతో ప్రభుత్వ స్కూళ్లలో కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాను. నేను వేసుకున్న యూనిఫాంకు గౌరవమిస్తాను.ప్రజలకు ఏదో చేయాలని ఆలోచిస్తుంటాను. అలాంటి నాపై దాడి జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

కాగా, అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారిణి అనితపై స్థానిక జడ్పీ ఛైర్మన్ కోనేరు కృష్ణ తన అనుచరులతో కలిసి దాడి చేసిన సంగతి తెలిసిందే.అనితపై దాడి తెలంగాణవ్యాప్తంగా సంచలనం రేపింది. ఘటనపై కేటీఆర్ తక్షణ చర్యలకు ఆదేశించడంతో కోనేరు కృష్ణతో పాటు మరో 16మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?