‘ఓ బేబీ’ సమంతకు వర్కవుట్ అయ్యేలా ఉంది కానీ.. అక్కడ మాత్రం అంతే..
ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో కొత్త కథలకు కొదవే లేదు. పక్క భాషల్లోంచి తీసుకొస్తున్నారా.. లేదంటే సొంతంగా ఆలోచించుకుని రాస్తున్నారా అనేది పక్కన బెడితే మంచి కథలు తెస్తున్నారు.. తీస్తున్నారు. ఇప్పుడు ఓ బేబీ కూడా ఇలాంటి కథే. అసలు 70 ఏళ్ల బామ్మ ఎక్కడైనా 25 ఏళ్ల భామగా మారుతుందా.. కానీ ఇప్పుడు ఓ బేబీలో జరిగింది ఇదే. ఇలాంటి కథతో సినిమా చేసింది నందిని రెడ్డి. ఈ సినిమా ఇప్పుడు విడుదలైంది. టాక్ కూడా పర్లేదు అని వచ్చింది. అయితే సమంత ఊహించినంతగా మాత్రం కాదు.
ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతానని ధీమాగా చెప్పింది ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు విడుదలైన తర్వాత ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అంటున్నారు ప్రేక్షకులు. అంటే సమంత బాగా చేసింది కానీ సినిమా మాత్రం ఎక్కడో గాడితప్పిందని దీని అర్థం. నిజానికి సినిమా అంతా బాగానే అనిపించినా కూడా చాలా నెమ్మదిగా సాగడం ఒక్కటే ఇప్పుడు ఓ బేబీకి మైనస్ అయిపోయింది. ఫస్టాప్ వరకు ఎలాంటి సమస్యా లేకుండా దూసుకుపోయిన ఓ బేబీ.. సెకండాఫ్ వచ్చేసరికి మాత్రం చేతులెత్తేసినట్లే అనిపించింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు లాజిక్‌కు అందకుండా ఉంటాయి.
దాంతో కథ ఎంతగా అర్థం చేసుకోవాలని ట్రై చేసినా కూడా ఊహకు అందదు. దేవున్ని తిట్టినంత మాత్రానా ఆయనే వచ్చి మళ్లీ బేబీకి వయసు ఇవ్వడం.. 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్ళడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. కానీ దాన్ని సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా తెరకెక్కించడం నందిని రెడ్డికి సాధ్యం కాలేదంటున్నారు ఆడియన్స్. బేబీ పాత్రలో సమంత స్థాయికి తగ్గ నటనతో చంపేసింది. కానీ సినిమా మాత్రం ఊహించిన స్థాయిలో రాలేదు. ప్రశంసల వరకు ఈ బేబీకి ఢోకా లేదు కానీ కలెక్షన్ల వరకు వస్తే మాత్రం కచ్చితంగా యావరేజ్ బేబీగానే మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Post a Comment