నల్లమలలో నరబలి ఇచ్చారా?
శిరువెళ్ల: నల్లమలలో నరబలి ఇచ్చారా? గుప్త నిధులు లేదా మరో ప్రయోజనం ఏదైనా ఆశించే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? ఇలా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల- ఒంగోలు ప్రధాన రహదారిలోని సర్వ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లోని కాల్వలో ఓ యువకుడి మృతదేహం కలకలం రేపింది. శిరువెళ్ల మండలంలోని పచ్చర్ల గ్రామం సమీప పరిసరాల్లోని కాల్వలో పాతిపెట్టిన మృతుని బోటనవేలు, ఇతర అవయవాలు ఈనెల 11న బయటపడిన విషయం తెలిసిందే. ఆలయ కాపలాదారు సమాచారం మేరకు గ్రామ రెవెన్యూ అధికారి శ్రీకాంత్‌రావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం అడవిలోని ఘటనాస్థలికి చేరుకున్నారు. మండల ఉప తహసీల్దార్ జిలానమ్మ ఆధ్వర్యంలో ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి, ఆళ్లగడ్డ పట్టణ ఎస్సై రామిరెడ్డి సమక్షంలో మృతదేహానికి నంద్యాల వైద్యులు అక్కడే శవపరీక్ష చేశారు. ఇందులో మృతదేహం నుంచి తల వేరుగా ఉండగా, ఎర్రటి మృతదేహం, నిమ్మకాయలు, నీలిరంగు అంగి, జీన్స్ ప్యాంట్, కాలి వేలికి రింగు, చేతికి వెండి ఉంగరం, బెల్టు లభ్యమైందన్నారు. మృతుని వయస్సు 30 ఏళ్లలోపు ఉంటుందన్నారు. యువకుడి మృతిపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.
మృతిపై అనుమానాలెన్నో..?
నల్లమల అడవిలో కాల్వలో అనుమానాస్పదంగా యువకుడి మృతదేహం లభ్యంపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. మృతుడు యువకుడు కావడం, ఘటనాస్థలిలో నిమ్మకాయలు పడి ఉండటం, జనసంచారం లేని అడవి ప్రాంతం, తల, మొండెం వేరుగా ఉండటంతో ఎవరైనా క్షుద్ర పూజలు చేశారా..? లేక గుప్త నిధుల తవ్వకంలో భాగంగా యువకుడిని నరబలి ఇచ్చారా, తదితర అనుమానాలెన్నో ఉన్నాయి.
Comments
Post a Comment