తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా స్వీట్ వార్నింగ్..
తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేసే పని మొదలు పెట్టిన కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో బీజేపీకి 19 శాతం ఓట్లు వచ్చాయని.. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఒక రోజు పర్యటన కోసం తెలంగాణ వచ్చిన ఆయన తొలుత శంషాబాద్ శివారులోని రంగనాయకతండాలో పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోనీబాయి అనే గిరిజన మహిళ ఇంట్లో జొన్నరొట్టె తిన్నారు. టీ తాగారు. అనంతరం శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తెలంగాణ బీజేపీ నాయకత్వానికి భారీ టార్గెట్ విధించారు. కనీసం 18లక్షల మంది సభ్యులను నమోదు చేయాలన్నారు. అంతకు ముందు 12 లక్షల కార్యకర్తలను చేర్చడాన్ని బీజేపీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, 18 లక్షల టార్గెట్‌ను చేరుకోవాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్ర నేతలకు చేతకాకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని చెప్పారు. జిల్లా జిల్లాలో పర్యటించి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలో 18 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, కనీసం మరో 18 లక్షల మందిని చేర్చాలని టార్గెట్ విధించారు. ప్రతి బూత్‌లోనూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. గెలిచిన బూత్‌లో కాదని, ఓడిన బూత్‌లో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని 17 రాష్ట్రాల్లో బీజేపీకి 50 శాతం ఓట్లు వచ్చాయని, తెలంగాణలో కూడా 50 శాతం ఓట్లు వచ్చేవరకు పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరికీ ఇల్లు, ఆ ఇంట్లో నీరు, విద్యుత్, గ్యాస్ సిలిండర్, మరుగుదొడ్డి ఉండేలా చేయడమే బీజేపీ లక్ష్యమని అమిత్ షా అన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అందుకు మార్గం చూపిస్తోందని చెప్పారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది దీన్ దయాళ్ విధానం అని.. బీజేపీ ఆ మార్గంలో పయనిస్తుందన్నారు.
అమిత్ షా చతురతతో తెలంగాణలో కూడా పాగా వేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మోదీకి పేరు వస్తుందన్న కారణంతో రాష్ట్రంలో కేంద్ర పథకాలను సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని లక్ష్మణ్ అన్నారు
Comments
Post a Comment