ఏపీలో రెండు కీలక పథకాలకు జగన్ మోహన్ రెడ్డి పేరు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 - 20 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ.2.27లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలకు వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు బీమా అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పలు పథకాలకు పెట్టారు. అయితే, పనిలో పనిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరుతో రెండు పథకాలకు కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ‘జగనన్న అమ్మ ఒడి’ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద స్కూలుకు పంపించే పిల్లల తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15వేలు వేస్తామని ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నవరత్నాలు పథకాల్లో ఈ పథకం ముఖ్యమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు పంపే విద్యార్థులతో పాటు ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింప జేయాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి బడ్జెట్‌లో రూ.6455 కోట్లు కేటాయించింది. దీని వల్ల 43 లక్షల మందికి లబ్ధి జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జగనన్న అమ్మ ఒడి పథకంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి కూడా జగన్ మోహన్ రెడ్డి పేరుపెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ‘జగనన్న విద్యాదీవెన’ అనే పేరు పెట్టారు.
Comments
Post a Comment