బుల్లెట్ సురేష్‌పై పోలీసు అధికారులను ధూషించి,బెదిరింపులకు పాల్పడ్డారంటూ కేసు
చిత్తూరు:
చిత్తూరు వైసీపీ ముఖ్యనేత, జిల్లా స్థాయి బీసీ నేత బుల్లెట్ సురేష్‌పై పోలీసు అధికారులను ధూషించి,బెదిరింపులకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది. గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా తనను వేధించారంటూ బుల్లెట్ సురేష్ అప్పట్లో ఇక్కడ పనిచేసిన సీఐలు నిరంజన్‌కుమార్, ఆదినారాయణలకు ఫోన్ చేసి దూషించడంతో పాటు కుటుంబసభ్యులతో సహా అంతం చేస్తానని బెదిరించారంటూ ఎస్పీకి ఫిర్యాదు అందింది. స్వయంగా బాధిత సీఐలు చిత్తూరు ఎస్పీని కలసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో ఆయన కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలో బుల్లెట్ సురేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. నగరంలో సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలిలా వున్నాయి.
గతంలో చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసుకు సంబంధించి విచారణలో భాగంగా నగర పోలీసులు పలువురు అనుమానితులను విచారించారు. ఆ సమయంలో వన్ టౌన్ సీఐ నిరంజన్‌కుమార్, వెస్ట్ రూరల్ సీఐ ఆదినారాయణ కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేశారు. ఇపుడు వారిద్దరిలో ఆదినారాయణ కర్నూలు జిల్లా సీసీఎస్‌లో సీఐగా పనిచేస్తుండగా నిరంజన్‌కుమార్ కడప వీఆర్‌లో వున్నారు. కాగా ఈ నెల 12వ తేదీన బుల్లెట్ సురేష్ తమకు ఫోన్ చేసి మేయర్ హత్య కేసు విచారణ పేరిట తనను అకారణంగా వేధింపులకు గురి చేశారంటూ దూషించారని, తమతో పాటు కుటుంబ సభ్యుల అంతు కూడా చూస్తానని బెదిరించారని వీరిద్దరూ ఆదివారం చిత్తూరులో ఎస్పీ అప్పలనాయుడిని కలసి ఫిర్యాదు చేశారు. ఆదినారాయణను ఽకొంచెం తక్కువ స్థాయిలో దూషించగా, నిరంజన్‌కుమార్‌ను మాత్రం తీవ్రస్థాయిలో దూషించి, బెదిరించినట్టు సమాచారం.
బుల్లెట్ సురేష్‌తో తమకు ప్రాణహాని వుందంటూ వారు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ దాన్ని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు పంపి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఆ మేరకు బుల్లెట్ సురేష్‌పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్పీ ఆదేశాలతో మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది కలసి సోమవారం ఉదయం 7 గంటలకు చిత్తూరు రామ్‌నగర్ కాలనీలోని బుల్లెట్ సురేష్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో సురేష్ ఇంట్లో లేరని, ఆయన తల్లి, భార్య, కుమారుడు వున్నారని తెలిసింది. తనిఖీలలో చట్టవ్యతిరేకమైన వస్తువులేవీ లభ్యం కాలేదని సమాచారం. బుల్లెట్ సురేష్ గతంలో టీడీపీ సానుభూతిపరుడిగా వున్నారు. ఇటీవలి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి క్రియాశీలకంగా పనిచేశారు. ఆయనపై గతంలో పలు కేసులుండగా తాజాగా పోలీసు అధికారులను దూషించి, బెదిరించారనే ఆరోపణలతో కేసు నమోదైంది. కేసు నమోదు కావడంతో పాటు ఆయన ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించడం నగరంలో సంచలనం సృష్టించడంతో పాటు ప్రధాన చర్చనీయాశంగా కూడా మారింది.
Comments
Post a Comment