రహదారి ప్రమాదంలో జవాన్‌ దుర్మరణం చెందారు

కడప జిల్లా: రహదారి ప్రమాదంలో జవాన్‌ దుర్మరణం చెందారు. బిడ్డ పుట్టిన ఆనందం పంచుకోకముందే అసువులు బాయడంతో భార్య, కుటుంబ సభ్యులు తీవ్రవేదనకు గురయ్యారు. ప్రమాదంలో తల్లి, సోదరి, ఆమె ఇద్దరి పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు చెన్నూరు మండలం కొండపేట గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి నాసిక్‌ రేంజ్‌లో మిలిటరీ జవాన్‌గా పనిచేస్తున్నారు. అతని తండ్రి వెంకటరెడ్డి కూడా మిలిటరీలో పనిచేసి పదవీవిరమణ చేశారు. గత కొన్నేళ్లుగా మధుమేహవ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి ఎక్కువ కావడంతో ఇటీవల తండ్రిని నాసిక్‌కు పిలిపించి మిలిటరీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్సచేసి ఓ కాలు తొలగించడంతో మంచానికే పరిమితమయ్యారు. తల్లి శంకరమ్మ కేన్సర్‌తో బాధపడుతోంది. వెంకటేశ్వరరెడ్డికి వివాహమైన ఎనిమిదేళ్ల తర్వాత ఇటీవలే కొడుకు పుట్టాడు. విషయం తెలిసి అన్నకు పుట్టిన కొడుకును, తల్లిదండ్రులను చూడాలని ఇటీవలే సోదరి సువర్ణ నాసిక్‌ వెళ్లారు. వారం రోజులు అంతా ఆనందంగా గడిపారు. సోదరిని ఊరికి పంపేందుకు బుధవారం రాత్రి కారులో షిరిడి వెళ్తుండగా నాసిక్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో వెంకటేశ్వరరెడ్డి(30) అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి శంకరమ్మ, సోదరి సువర్ణ, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంకటశ్వరరెడ్డి మృతదేహాన్ని శుక్రవారం స్వగ్రామం కొండపేటకు తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పరామర్శించి ఓదార్చారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?