పాక్ గగనతలం భారత విమానాలకు అందుబాటు
ఢిల్లీ :
తమ గగనతలం పై విధించిన ఆంక్షల్ని ఎత్తివేసినట్లు మంగళవారం వేకువజామున 12.41 గంటల తరువాత.. పాక్ గగనతలం భారత విమానాలకు అందుబాటులోకి రానున్నట్లు పాకిస్థాన్ పౌర విమానయాన సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. గతంలో ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ (ఎటిఎస్) లో ప్రచురించిన అన్ని మార్గాల్లో విమానాలు వెళ్లవచ్చునని ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ తో పాటు పలు దేశాలకు చెందిన పౌర విమానాలు పాక్ మీదుగా నిర్దేశిత మార్గంలో వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. ఫిబ్రవరిలో బాలాకోట్ దాడుల తర్వాత రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. పాక్ తమ గగనతలాన్ని మూసివేసింది. దాదాపు అయిదు నెలల తరవాత పాక్ ఆంక్షల్ని ఎత్తివేయడం గమనార్హం. పాక్ నిర్ణయం భారత విమానయాన సంస్థలకు ఊరటనిచ్చే విషయం. దాయాది దేశం నిర్ణయంతో జులై 2 వరకు ఎయిర్ ఇండియా దాదాపు రూ.491 కోట్లు నష్టపోయింది. ఢిల్లీ నుంచి ఐరోపా దేశాలకు నడిపే అనేక సర్వీసుల మార్గాలను మార్చాల్సి రావడం వల్ల ఈ నష్టం వాటిల్లింది. స్పైస్‌జెట్ రూ.30.73, ఇండిగో రూ.25.1, గోఎయిర్ రూ.2.1 కోట్లు నష్టపోయినట్లు ఇటీవల రాజ్యసభకు అందించిన నివేదికలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. పాక్ నిషేధం వల్ల అనేక మార్గాలను మార్చడంతో పాటు కొన్ని విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. ఆంక్షలతో పాక్ సైతం భారీగా నష్టపోయినట్లు సమాచారం. పాక్ నిర్ణయంపై స్పందించిన భారత్.. ఇరు దేశాల మధ్య అన్ని మార్గాల్లో విమానయాన ఆపరేషన్లు పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు సమీపాన ఉన్న వైమానిక స్థావరాల నుంచి భారత్ మోహరించిన అన్ని విమనాలను వెనక్కి తీసుకునేంత వరకు ఆంక్షల్ని ఎత్తివేసేది లేదని పాక్ ఇటీవల ప్రకటించిన కొన్ని రోజులకే తాజా నిర్ణయం వెలువడడం గమనార్హం.
Comments
Post a Comment