కేంద్రం తీరుపై నిరసన.. రాజ్యసభ నుంచి విజయసాయిరెడ్డి వాకౌట్
కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వాకౌట్ చేశారు. జనాభా దామాషా ప్రకారం.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ విజయసాయిరెడ్డి ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్, సమాజ్ వాదీ, ఆమ్ ఆద్మీ, ఆర్జేడీ పార్టీలు మద్దతు పలికాయి. దీనిపై ఓటింగ్ నిర్వహించాలంటూ విజయసాయిరెడ్డి పట్టుబట్టారు. అయితే, ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి, సభలో సగం మంది సభ్యులు ఉండాలని ప్రభుత్వం వాదించింది. దీనిపై ఓటింగ్ కూడా సాధ్యం కాదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని విజయసాయిరెడ్డికి సూచించారు. కేంద్ర మంత్రి ప్రతిపాదనను విజయసాయిరెడ్డి తోసిపుచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 60 శాతం మంత్రి పదవులు బీసీలు, వెనుకబడినవర్గాలకే ఇచ్చారని విజయసాయిరెడ్డి అన్నారు. అయినా, బిల్లు పెట్టిన సమయంలో అభ్యంతరం తెలపని కేంద్ర ప్రభుత్వం.. ఓటింగ్ సమయంలో అడ్డుపడడాన్ని ఆయన తప్పుపట్టారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
Comments
Post a Comment