ఏపీలో ఫాసిస్ట్ ప్రభుత్వం... మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై మాజీమంత్రి, టీడీపీ ముఖ్యనేత యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాల మీద దాడులు చేయడమే వైసీపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా ఉందని ఆయన విమర్శించారు. ఏపీలో సీఎం జగన్ నెల రోజుల పాలన తీరు అధ్వానంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పోయి... ఫాసిస్ట్ ప్రభుత్వం వచ్చిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రగతి దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని యనమల మండిపడ్డారు. అన్నం ఎలా ఉందని తెలుసుకునేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలన్నట్టు... జగన్ ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉంటుందో నెల రోజల పాలనను బట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
నెల రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వ అసమర్ధత, అరాచకం బయటపడిందని యనమల విమర్శించారు. సమస్యల్లో ఉన్న రైతులను ఆదుకునే చర్యలను ప్రభుత్వం చేపట్టడం లేదని.. విత్తనాలకు రూ.380కోట్లు ఇవ్వలేనివారు వేల కోట్ల హామీలు ఎలా నెరవేరుస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని పట్టించుకోకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కమిటిల పేరుతో రాజధాని నగర నిర్మాణ పనులు ఆపేశారని యనమల విమర్శించారు. రాష్ట్రం అంతటా అనిశ్చిత పరిస్థితి కల్పించారని.. భవిష్యత్తులో తీవ్ర నష్టం వాటిల్లబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Post a Comment